మై భారత్ నమోదు డ్రైవ్ విజయవంతానికి సమిష్టి కృషి

by Taduka Kalyani |

యువతకు జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే మై భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు.

మై భారత్ నమోదు డ్రైవ్ విజయవంతానికి సమిష్టి కృషి
X

దిశ,సంగారెడ్డి అర్బన్: యువతకు జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే మై భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో మై భారత్ నమోదు డ్రైవ్ కు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మై భారత్ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మై భారత్ పోర్టల్ లో నమోదు చేసుకున్న యువతకు జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నాయకత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు మరియు యువజన అభివృద్ధికి సంబంధించిన అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలో నిర్దేశించిన నమోదు లక్ష్యాలను సాధించేందుకు గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.మై భారత్ జిల్లా కార్యక్రమ అధికారి ఎం. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు మై భారత్ ఇంటెన్సివ్ నమోదు మరియు అవగాహన డ్రైవ్ కొనసాగుతోందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాలు, క్రీడాకారుల భాగస్వామ్యంతో యువతను పెద్ద ఎత్తున మై భారత్ పోర్టల్ లో నమోదు చేయించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ జ్యోతి, జిల్లా పరిషత్ సిఈఓ జానకి రెడ్డి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే. ధనంజనేయులు, జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖ అధికారులు, మై భారత్ జిల్లా కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ మరియు ఎన్‌సీసీ ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story