39 ఏళ్ల తర్వాత ఒక్కటైన బాల్య స్నేహితులు

by Batti.Sumithra |

కాలం మారుతున్నా, వయసు పైబడుతున్నా బాల్య జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పచ్చగానే ఉంటాయని మిర్జాపూర్ (బి) ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు నిరూపించారు.

39 ఏళ్ల తర్వాత ఒక్కటైన బాల్య స్నేహితులు
X

దిశ, జహీరాబాద్ : కాలం మారుతున్నా, వయసు పైబడుతున్నా బాల్య జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పచ్చగానే ఉంటాయని మిర్జాపూర్ (బి) ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు నిరూపించారు. ఆ పాఠశాలకు చెందిన 1987-88 వాద్యా సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు సుమారు 39 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చి ఆత్మీయంగా గడిపారు.

గుర్తుకొస్తున్నాయి..

దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చిన్ననాటి అల్లరిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు తమ వ్యక్తిగత జీవితాల గురించి, పిల్లల ఎదుగుదల, కుటుంబ విశేషాలను తోటి మిత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

గురువులకు వందనం- మిత్రులకు నివాళులు..

తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణతో కూడిన తమ పాఠశాల రోజులే నేటి తమ విజయానికి పునాది అని కొనియాడారు. అయితే, ఈ సంతోష సమయంలో తమతో పాటు చదువుకుని నేడు భౌతికంగా దూరమైన ఎనిమిది మంది మిత్రులను, మరణించిన గురువులను వారు స్మరించుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ, మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. మళ్ళీ ఇన్నాళ్లకు కలుసుకోవడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక కలయికగా కాకుండా, పాత స్నేహాలను పునరుద్ధరించుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని విద్యార్థులు, గురువులు అభిప్రాయపడ్డారు.

Next Story