- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈదుల వాగు కబ్జాకు అధికారులు అండ!
సదాశివపేటలో శ్రీనిధి నియోసిటీ వెంచర్ యథేచ్ఛగా ఈదులవాగును ఆక్రమించింది.

దిశ, సంగారెడ్డి : సదాశివపేటలో శ్రీనిధి నియోసిటీ వెంచర్ యథేచ్ఛగా ఈదులవాగును ఆక్రమించింది. అదే కాకుండా మరో నాలుగు కాలువలను సైతం ఆక్రమించి పూర్తిగా మట్టితో పూడ్చివేశారు. అంతే కాకుండా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈదులవాగును, ఆ వెంచర్ నుంచి ప్రవహిస్తున్న మరో నాలుగు కాలువలకు ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు. ఇటీవల కాలంలో జిల్లాలో వాగులు, వంకలు, ఆఖరికి మంజీర నదిని సైతం ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఆక్రమించారు. దీనికంతటికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు అందించే ముడుపులకు లొంగిపోతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అదే విధంగా శ్రీనిధి వెంచర్ లో యాజమాన్యం ఈదుల వాగు ఆక్రమణతో పాటు మరో నాలుగు కాలువలను ఆక్రమిస్తే వారికి ఎంతైనా ఆక్రమించుకోండి తమకేం సంబంధం లేదంటూ వారికి ఎన్ఓసీలు ఇవ్వడం గమనార్హం. ఆక్రమణలకు సదాశివపేట మండలం, పట్టణం వాగులు, కాలువలను ఆక్రమించడంలో ముందుంది. సదాశివపేట పట్టణ పరిధిలో ఏర్పాటు చేస్తున్న శ్రీనిధి వెంచర్ 99 ఎకరాల్లో చేపట్టారు. ఆ వెంచర్ నుంచి వెలుతున్న ఈదులవాగును ఆక్రమించారు. అదే విధంగా అదే వెంచర్ లో మరో నాలుగు చిన్న కాలువలు ఉన్నాయి. వాటిని పూర్తిగా ఆక్రమించి మట్టితో పూడ్చివేసి వెంచర్ లో కలుపుకున్నారు. ఈదులవాగుపై వంతెనలు నిర్మించి వాగు విస్తీర్ణాన్ని కుదించారు. ఆక్రమించిన కాలువలు, వాగును పూడ్చివేసి రోడ్లు నిర్మాణాలు చేపట్టింది. ఈదులవాగుపై బ్రిడ్జీలు, వంతెనల నిర్మాణాలు చేపట్టింది. కాలువలపై బ్రిడ్జిలు నిర్మించి దర్జాగా రోడ్లు నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు వచ్చిన కూడా శ్రీనిధి వెంచర్ యాజమాన్యం బరితెగించి శరవేగంగా పనులను కొనసాగించింది.
తాత్కాలిక డీటీసీపీతో పనుల కొనసాగింపు..
సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో 99 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీనిధి వెంచర్ వెంచర్ ఏర్పాటు కోసం డీటీసీపీ కోసం దరఖాస్తు మాత్రమే చేసుకున్నారు. వారికి డీటీసీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. మా వద్ద అన్నీ ఉన్నాయంటూ అడిగిన వారిని భయాబ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీనిధి నియో సిటీ యాజమాన్యం సర్వే నంబర్ 694, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 711, 712 లలో వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నది. ఈ వెంచర్ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలు అందిస్తున్నారు. వెంచర్ యాజమాన్యం అన్ని అనుమతులు తీసుకుందంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. వ్యవసాయ భూములకు కన్వర్షన్ లేకుండా, ఎల్.పీ నంబర్, రేరా లేకుండా వెంచర్ నిర్మాణం ఎలా చేస్తారో వారికే తెలియాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ పనులు ప్రారంభించడంతో పాటు ప్లాట్ల అమ్మకాలు సైతం చేపట్టారు. అనుమతులు లేకుండా మున్సిపాలిటీ పరిధిలో వెంచర్ లో పనులు కొనసాగడంపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మౌనం వహిస్తున్నారు. పైగా డీటీసీపీకి దరఖాస్తు చేసుకున్నారని వెంచర్ యాజమాన్యానికి వత్తాసు పలుకడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్లు..
శ్రీనిధి నియోసిటీ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేయడంతో పాటు అందులో ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. అనుమతులు లేవని తెలిసినా కూడా గజాలలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. అనుమతులు లేకుండా తాటికాయంత అక్షరాలతో శ్రీనిధి నియో సిటీ అంటూ బోర్డులు పెట్టినా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ అధికారులకు ఆ బోర్డులు, రిజిస్ట్రేషన్లు, ప్రచారాలు కనిపించడం లేదు. అక్రమంగా ఏర్పాటు చేస్తున్న శ్రీనిధి నియోసిటీ వెంచర్ కు ప్రజాప్రతినిధులు ఓ వైపు సహకారం అందిస్తుంటే అధికారులు మరో వైపు సహకరిస్తూ ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారు. ఏయే సర్వే నంబర్లు కన్వర్షన్ అయ్యాయో రెవెన్యూ అధికారులకు తెలిసినా కూడా దర్జాగా క్రయ విక్రయాలు సాగుతున్నాయి. ఎవరికి కావాల్సింది వారు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ అధికారులు వాగుకు, కాలువలకు ఎన్ఓసీలు ఇవ్వడం ఓ ఎతైతే, డీటీసీపీ లేకుండా నిర్మాణాలను ఆపాల్సిన మున్సిపల్ అధికారులు మౌనం వహించడం, ఇవ్వన్నీ తెలిసినా కూడా రిజిస్ట్రేషన్ అధికారులు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని ఈదులవాగు, మరో నాలుగు కాలువలను కాపాడాలని పేట వాసులు కోరుతున్నారు.






