ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే రైతులకు భరోసా

by Taduka Kalyani |

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే రైతులకు భరోసా
X

దిశ, చేగుంట: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం చేగుంటలో నిర్వహించిన ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని దీనివల్ల వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగు రైతులకు ఇబ్బందులు కలిగించవచ్చని అన్నారు. అందువల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

వరి సాగుకు బదులుగా పెసర, మినుము, కంది, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలు అలాగే జొన్న, సజ్జ రాగులు వంటి చిరుధాన్యాల సాగు రైతులకు అనుకూలమని పేర్కొన్నారు. ఆయా పంటల సాగుకు అనువైన విత్తే సమయం విత్తన మోతాదు పంట కాలం ఆశించిన దిగుబడులపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. నీటి పొదుపు పద్ధతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలు తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటల ఎంపిక మార్కెట్ అవకాశాలపై రైతులకు సూచనలు అందించారు. అనంతరం మంత్రి చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.చేగుంట ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసేందుకు కృషి చేసి త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రకటనకు విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీఓ బావయ్య, డీఏఓ విన్సెంట్ వినయ్ కుమార్, మండల్ స్పెషల్ ఆఫీసర్ హేమ భార్గవి ,దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ బాల లక్ష్మి, ఎంపీడీవో చిన్న రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు,సొసైటీ ఛైర్మన్ మ్యకల పరమేష్ , చేగుంట గ్రామ సర్పంచ్ స్రవంతి, ఎంఈఓ నీరజ, వివిధ గ్రామ సర్పంచులు,ఉపాధ్యాయులు రైతులు విద్యార్థులు సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ,ప్రతినిధులు రామకృష్ణ, విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.

Next Story