సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 అమలుకు కార్యాచరణ.. శాఖల సమన్వయం తప్పనిసరి

by Taduka Kalyani |

జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలు-2026ను సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 అమలుకు కార్యాచరణ.. శాఖల సమన్వయం తప్పనిసరి
X

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలు-2026ను సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవో, డివిజనల్ పంచాయతీ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, డీఆర్‌డీఓ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం, చెత్తను కాల్చివేయడాన్ని పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణతో సమస్యను పరిష్కరించాలన్నారు. అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా గుర్తించి, నిబంధనల ప్రకారం వారే వ్యర్థాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలని, రోడ్లపై చెత్త లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. కొత్త మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు భూసేకరణ, మౌలిక వసతులపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచి, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలన్నారు. సమావేశంలో మున్సిపాలిటీల ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఆస్తి పన్ను వసూళ్లపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగం తగ్గించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన బట్ట సంచులను కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ పాండు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, డీఆర్‌డీఓ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story