స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి 15 రోజుల డెడ్ లైన్

by Nallavelli.Anjaneyulu |

నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి కంగ్టి మండలంలో తాగునీటి, విద్యుత్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి 15 రోజుల డెడ్ లైన్
X

దిశ, కంగ్టి : నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి కంగ్టి మండలంలో తాగునీటి, విద్యుత్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. డీడీలు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు కరెంట్ సప్లై అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల విద్యుత్ శాఖ అధికారి శోభారాణి పై కూడా పలువురు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సమయానికి స్పందించకపోవడం వల్ల సమస్యలు తీవ్రమయ్యాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన అంశాల్లో, అత్యవసర సమయాల్లో ఫోన్ చేసినప్పటికీ అధికారి ఫోన్ ఎత్తకపోవడం, ఎత్తినప్పటికీ సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఫోన్ చేయవద్దని, అది ఆఫీస్ టైం కాదని చెప్పడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

పలువురు రైతులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు పైగా డీడీలు కట్టినప్పటికీ తమకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే చాలా గ్రామాల్లో 30–40 సంవత్సరాల క్రితం వేసిన విద్యుత్ తీగలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అవి గాలికి పడిపోవడం, తరచూ తెగిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పాత తీగలను తొలగించి కొత్త విద్యుత్ లైన్లు వేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌలాస్ ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న బొర్గి, చౌకనపల్లి గ్రామాలతో పాటు కంగ్టి మండలంలోని సుమారు 30 గ్రామాలు, పక్కనే ఉన్న జుక్కల్ ప్రాంత గ్రామాలకు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ఒక్కరోజు కూడా తాగునీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడుతూ 134 కేవీ సబ్‌స్టేషన్, పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ద్వారా సాంకేతిక సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. అడవులు, వాగుల ద్వారా వెళ్లే లైన్ల కారణంగా తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, వాటిని నివారించేందుకు ఇంటర్‌లింక్ లైన్ ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. గతంలో బడ్జెట్ లేకపోవడం వల్ల నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి, ₹15 కోట్ల నుంచి ₹30 కోట్లకు పెంచిన బడ్జెట్‌తో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కంగ్టి మండల వ్యాప్తంగా ఉన్న విద్యుత్, తాగునీటి సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు.


నిర్దిష్ట సమయంలో సమస్యలు పరిష్కరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా రాజకీయ అంశాలపై మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం లక్షల కోట్లు వృథా చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు సింగూరు నుంచి మిడ్ మానేరు వరకు నీటిని అక్రమంగా తరలించారని, “నీటి దొంగ”గా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన ప్రయోజనాల కోసం నిధులు లేకపోవడంతో వయోపరిమితిని పెంచారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నదని తెలిపారు. మొత్తానికి, కంగ్టి మండలంలో ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ సుధీర్ కుమార్, డిఇ శ్రీనివాస్, ఏఈ శోభారాణి, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, డిఇ ఫణి వర్మ, ఏఈ జైపాల్, సంపూర్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు దామ నాగన్న , మాధవరావు పటేల్ , మనోజ్ పటేల్ , పరశురామ్ , శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Next Story