Raghunandan Rao: పార్లమెంట్‌లో జరిగిన దాడికి నేనే ప్రత్యక్ష సాక్షిని

by Gantepaka Srikanth |

రాహుల్‌ను సభలోకి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, కానీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతల తీరు దారుణంగా ఉందని, మహిళల ఛాతిపై చేతులు వేసి దాడి చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.

Raghunandan Rao: పార్లమెంట్‌లో జరిగిన దాడికి నేనే ప్రత్యక్ష సాక్షిని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్‌ను సభలోకి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని, కానీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతల తీరు దారుణంగా ఉందని, మహిళల ఛాతిపై చేతులు వేసి దాడి చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పార్లమెంట్‌లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షి అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. అంబేద్కర్ పేరిట కాంగ్రెస్ చేసిన నీచ రాజకీయాల నిరసిస్తూ ఎన్డీయే ఎంపీలు శాంతియుతంగా పార్లమెంట్‌లో నిరసన తెలియజేసినట్లు రఘునందన్ రావు తెలిపారు. రాహుల్ గాంధీ.. ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుని, పక్కన దౌర్జన్యం చేసే వాళ్లను పెట్టుకొని సీనియర్లను, మహిళలను కూడా గౌరవించలేదని విమర్శలు చేశారు.

ఆయన తీరు వల్ల మాజీ మంత్రి, ఎంపీ సారంగికి గాయాలయ్యాయని, అందుకు రాహుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను రెండుసార్లు ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని, కానీ ఇప్పుడు కాంగ్రెస్.. అంబేద్కర్‌కు వారసులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించడమే కాకుండా, తమ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకుందని ఫైరయ్యారు. కానీ అంబేద్కర్‌కు మాత్రం భారతరత్న ఇవ్వలేదని విమర్శలు చేశారు. ఓట్ల కోసం అంబేద్కర్ వారసులమని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను పంచ తీర్థ్‌గా బీజేపీ అభివృద్ధి చేసిందని మెదక్ ఎంపీ గుర్తుచేశారు. అంబేద్కర్ కు చేసిన అవమానాలను దేశం ముందు పెడితే.. తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Next Story