రేపటి నుంచి యాక్సెస్ కంట్రోల్.. చర్లపల్లి టెర్మినల్‌లో రద్దీ నియంత్రణకు చర్యలు

by Ajay Maddhiboyina |

చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

రేపటి నుంచి యాక్సెస్ కంట్రోల్.. చర్లపల్లి టెర్మినల్‌లో రద్దీ నియంత్రణకు చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్ దక్షిణ ప్రాంతం (ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు) నూతన టెర్మినల్ భవనం వద్ద సోమవారం నుంచి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అమలు చేయనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి వంటి ప్రధాన స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు అభివృద్ధి చేసిన ఈ కొత్త టెర్మినల్ వద్ద అనధికారిక పార్కింగ్‌ను అరికట్టడానికే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై ప్రతి వాహనం స్టేషన్‌లోకి ఎంట్రీ కావాలంటే యాక్సెస్ కంట్రోల్ పాయింట్ వద్ద రశీదు తీసుకుని... ఎగ్జిట్ కోసం నిర్ణీత గడువు ముగిస్తే పేమెంట్ చేసి రావాల్సిందే.

ప్రయాణ ఖర్చు కన్నా పార్కింగ్ ఖర్చే ఎక్కువ!

చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే సామాన్యుడికి సౌకర్యంగా ఉంటుందనుకుంటే, ఈ పార్కింగ్ ధరలు చూస్తుంటే షాక్ తగలడం ఖాయం. గంటకు రూ.10 చొప్పున వసూలు చేస్తే, ఒక బైక్‌ను రోజంతా పార్కింగ్ చేస్తే రూ.240 దాటిపోతుంది. అంటే ప్రయాణికుడు కర్నూలుకో, విజయవాడకో రైలులో వెళ్లి రావడానికి అయ్యే సాధారణ టికెట్ ఖర్చు కన్నా ఇక్కడ ఒక్క రోజు బండిని పార్కింగ్ చేసేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ అన్నమాట. నగరానికి దూరంగా ఉన్న చర్లపల్లికి వెళ్లడానికి సరైన ఆర్టీసీ బస్సులు, మెట్రో కనెక్టివిటీ లేక సొంత వాహనాలపై వచ్చే సామాన్యుడి నడ్డి విరవడమే ప్రయాణికుల సౌకర్యం అంటే ఇదేనేమో మరి.

20 నిమిషాలు దాటితే భారీ చార్జీలు

ప్రయాణికులను దింపడానికి లేదా పికప్ చేసుకోవడానికి వచ్చే వాహనాలకు మొదటి 20 నిమిషాల వరకు ఎలాంటి రుసుము ఉండదు. అయితే, నిర్ణీత సమయం దాటి స్టేషన్ ఆవరణలో నిలిపితే మాత్రం కింది విధంగా చార్జీలు వసూలు చేస్తారు.

0 నుంచి 20 నిమిషాలు: ఉచితం

20 నుంచి 30 నిమిషాలు: రూ.50

30 నుంచి 45 నిమిషాలు: రూ.100

45 నుంచి 60 నిమిషాలు: రూ.200

60 నిమిషాలు దాటితే: రూ.500

పార్కింగ్ చార్జీల వివరాలు

ఎక్కువ సమయం వాహనాలను నిలపాలనుకునే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో పార్కింగ్ చేసే వాహనాలకు పైన పేర్కొన్న యాక్సెస్ కంట్రోల్ చార్జీలు వర్తించవు.

పార్కింగ్ ధరలు

4 వీలర్: మొదటి రెండు గంటలకు రూ.20, (ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున)

2, 3 వీలర్: మొదటి రెండు గంటలకు రూ.15, (ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున)

నెలవారీ పార్కింగ్ ధరలు

సాధారణ ప్రజలు రైల్వే ఉద్యోగులు

4 వీలర్: రూ.2,500 రూ.1,250

బైక్/ఆటో: రూ.1,200 రూ.600

Next Story