ఆర్టీసీ ఆస్పత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు.. అభినందించిన ఎండీ నాగిరెడ్డి

by Ramesh Naini |

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి వైద్య సేవలు అందించే తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) నుంచి గుర్తింపు లభించింది.

ఆర్టీసీ ఆస్పత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు.. అభినందించిన ఎండీ నాగిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి వైద్య సేవలు అందించే తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) నుంచి గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్య సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వైద్య సేవల బలోపేతం, సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి జరుగుతోంది. అధునాతన అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు, వివిధ రకాల చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సదుపాయాలు రోగులకు సమయానుకూలంగా, సురక్షితంగా, ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి.

నాణ్యమైన ఆరోగ్య సేవలకు గుర్తింపు

ఎన్ఏబీహెచ్ గుర్తింపు నాణ్యమైన ఆరోగ్య సేవలకు గుర్తింపుగా భావిస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తుందని, ఎన్ఏబీహెచ్ గుర్తింపును అందుకు ప్రతిఫలంగా భావిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి తెలిపారు. సూపరింటెండెంట్, వైద్య బృందం, సిబ్బందిని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన వైద్య సేవల్ని అందించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు కొనసాగించాలని సూచించారు. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ లో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇవి నైపుణ్యంతో కూడిన ఆరోగ్య సేవా సిబ్బందిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Next Story