- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో తగ్గుతున్న మాతృ మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం
దేశవ్యాప్తంగా మాతృ మరణాల నిష్పత్తి 88కి తగ్గగా, తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా మాతృ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రి ప్రసవాల పెంపు వంటి చర్యల వల్ల ఈ సానుకూల ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా విడుదలైన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) బులిటెన్ 2021-23 ప్రకారం.. దేశంలో ప్రస్తుతం ప్రతి లక్ష సజీవ జననాలకు మాతృ మరణాల రేటు 88కి చేరింది. గతంలో ఇది 93గా ఉండేది. అయితే దేశవ్యాప్తంగా తగ్గుదల ఉన్నప్పటికీ, తెలంగాణలో మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో పరిస్థితి..
దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలను సాధించింది. ఏపీలో 2019-21లో 46గా ఉన్న ఎంఎంఆర్.. 2021-23 నాటికి 30కి తగ్గడం విశేషం. అయితే తెలంగాణలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సంఖ్యలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. 2019-21లో 45గా ఉన్న ఎంఎంఆర్, 2020-22లో 50కి, 2021-23 నాటికి 59కి పెరిగింది. కేరళలో 30, తమిళనాడులో 35, కర్ణాటకలో 68గా మాతృ మరణాల రేటు నమోదైంది. కాగా.. దేశంలో మాతృత్వ మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ (30), ఆంధ్రప్రదేశ్ (30), తమిళనాడు (35) టాప్ త్రీలో ఉన్నాయి. ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా (153), ఛత్తీస్‌గఢ్ (146), మధ్యప్రదేశ్ (142) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్(141), అస్సాం (110), బిహార్ (104), పశ్చిమ బెంగాల్ (104), ఉత్తరాఖండ్ (91), పంజాబ్ (90), హర్యానా (89)లు జాతీయ సగటు కంటే ఎక్కువగా మాతృ మరణాల రేటును కలిగి ఉన్నాయి.
మాతృ మరణం అంటే?
వైద్య పరిభాషలో మాతృ మరణం అంటే కేవలం ప్రసవ సమయంలో జరిగే మరణం మాత్రమే కాదు. గర్భధారణ సమయం నుంచి ప్రసవమైన 42 రోజుల వరకు గర్భసంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల సంభవించే మరణాలను మాతృ మరణాలుగా పరిగణిస్తారు. ప్రసవ సమయంలో నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉండటం (ఎస్బీఏ), నాణ్యమైన ముందస్తు వైద్య పరీక్షలు (ఏఎన్సీ) ఈ మరణాలను అరికట్టడంలో కీలకం. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం గర్భధారణ సమయం నుంచి ప్రసవం వరకు తల్లులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ఆసుపత్రుల్లోనే ప్రసవాల ద్వారా మాతృత్వ మరణాలు తగ్గించవచ్చనే ఉద్దేశంతోనే అనేక పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది.
అండగా నిలుస్తున్న కేంద్ర పథకాలు..
మాతృ మరణాలను తగ్గించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) చేరుకోవడానికి కేంద్రం పలు పథకాలను అమలు చేస్తోంది. జననీ సురక్షా యోజన (జేఎస్‌వై) జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ప్రసవాలు, మందులు, రవాణా, నగదు ప్రోత్సాహకాలు అందించారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) పథకం ద్వారా ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు నిపుణులైన వైద్యులతో ఉచిత పరీక్షలు అందించారు. సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ (సుమన్) పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించే భరోసా కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ గదులు (లేబర్ రూమ్స్), ప్రసూతి ఆపరేషన్ థియేటర్లలో (మెటెర్నిటీ ఓటీ) వైద్య సేవల నాణ్యతను లక్ష్య పథకం ద్వారా మెరుగుపర్చారు. లేబర్ రూమ్‌లు, ఆపరేషన్ థియేటర్లలో సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో ఆసుపత్రి ప్రసవాలే శ్రీరామరక్ష అయ్యాయి.






