త్వరలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..! కలెక్టర్ల పనితీరుపై సీఎంకు ప్రోగ్రెస్ రిపోర్ట్

by Kema Shiva Kumar |

జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎస్ రామకృష్ణారావు ప్రతి నెలా నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్‌కు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది.

త్వరలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..! కలెక్టర్ల పనితీరుపై సీఎంకు ప్రోగ్రెస్ రిపోర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎస్ రామకృష్ణారావు ప్రతి నెలా నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్‌కు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది. సీఎస్ ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టులో కొందరు కలెక్టర్లు ఆశించిన స్థాయిలో పని చేస్తుండగా, ఇంకొందరు అత్తెసరు మార్కులతో పాస్ అయ్యారనే చర్చ జరుగుతున్నది. బాగా పని చేస్తున్న ఆఫీసర్లను మరికొంత కాలం పాటు అదే జిల్లాల్లో కొనసాగించి, పని తీరు సరిగా లేని వారిపై బదిలీ వేటు వేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ బదిలీల ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రతి నెలా సీఎంకు రిపోర్టు

ఏ జిల్లా కలెక్టర్ ఏ రోజు ఏం చేశారు? ఎక్కడ పర్యటించారు? ప్రజా సమస్యలు వింటున్నారా? ప్రభుత్వ పథకాల అమలులో సదరు ఆఫీసర్ చొరవ ఎలా ఉంది? అనే అంశాలపై సీఎస్ రామకృష్ణారావు ప్రతి నెల చివరన రిపోర్టు తయారు చేసి సీఎంకు పంపుతున్నారు. అందులో నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో పాటు తనకున్న సొంత నెట్‌వర్క్ ద్వారానూ సీఎస్.. కలెక్టర్ల కదలికలపై నిఘా ఉంచి నివేదికలు తయారు చేస్తున్నారు. రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ రెండో వారంలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఆ టైంలోనే అవినీతి ఆరోపణలు ఉన్న కొందరు కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేసి కొత్త వారిని అపాయింట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై సీఎస్ పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేస్తున్నట్టు తెలుస్తున్నది.

గురుకులాల విజిట్‌‌పైనా ఆరా

రాష్ట్రంలోని అనేక గురుకులాల్లో భోజనం సరిగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించడం కోసం కలెక్టర్లు ఏం చేస్తున్నారు? గురుకులాలకు వెళ్తున్నారా? పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారా? అనే సమాచారం సైతం ప్రత్యేకంగా సేకరించినట్లు తెలుస్తున్నది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుపై ఏ మేరకు దృష్టి సారిస్తున్నారు?.. వర్షాలు, వరదల టైంలో కలెక్టర్లు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వస్తున్న ప్రజల సమస్యలను ఏ మేరకు తీర్చుతున్నారు? ఆ కలెక్టర్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? అని సీఎస్ ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది.

సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారా?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కలెక్టర్లు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. కొందరైతే ఏకంగా బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇంకొందరు తమ ఫ్యామిలీ మెంబర్ల ద్వారా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు నెలల క్రితం జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. ఆ తర్వాత నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అవినీతి విషయంలో కలెక్టర్లకు సీరియస్‌గా కౌల్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కొత్తగా జిల్లాలకు వెళ్లిన అధికారులు, అంతకు ముందు నుంచే పని చేస్తోన్న​ఐఏఎస్‌ల కదలికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. ఎవరెవరు ఎలాంటి దందాలకు పాల్పడుతున్నారు? అనే సమాచారం సేకరించినట్లు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది.

కలెక్టర్లపై ఫిర్యాదులు

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన జెండావందనానికి కలెక్టర్ ఆలస్యంగా రావడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయనకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పెద్దపల్లి కలెక్టర్ తమ ఫోన్ ఎత్తడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీ వంశీ పార్లమెంటు కమిటీకి ఫిర్యాదు చేశారు.

Next Story