- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఈ పాలు తాగితే పిల్లలు కూడా పుట్టరు.. వెరీ డేంజరస్
అత్యాశకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నాలుగు లీటర్ల పాలు ఇచ్చే పశువు నుంచి బలవంతంగా పది లీటర్లు పిండాలనే స్వార్థం నోరులేని జీవాల ప్రాణాల మీదకు తెస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యాశకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నాలుగు లీటర్ల పాలు ఇచ్చే పశువు నుంచి బలవంతంగా పది లీటర్లు పిండాలనే స్వార్థం నోరులేని జీవాల ప్రాణాల మీదకు తెస్తోంది. పశువుల్లో కృత్రిమంగా పాలను పెంచేందుకు వినియోగించే ప్రమాదకర ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) అధికారులు పటాన్‌చెరువులో భారీగా పట్టుకున్నారు. పటాన్‌చెరువు ప్రాంతంలోని పశుగ్రాసం విక్రయ కేంద్రాలపై గురువారం, శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమ నిల్వలను గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్‌చెరువులోని రెండు పశుగ్రాసం దుకాణాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. పాటి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న శ్రీ రేణుక క్యాటిల్ ఫీడ్ దుకాణంలో యజమాని ఆర్. సాయికృష్ణ గౌడ్ నుంచి లేబుల్ లేని 200 మి.లీ. పరిమాణం గల 40 ఆక్సిటోసిన్ బాటిళ్లను సీజ్ చేశారు. చైతన్య నగర్ కాలనీలో మైలారం సాయిరామ్ అనే వ్యక్తి నడుపుతున్న లక్ష్మి కృష్ణ క్యాటిల్ ఫీడ్ దుకాణంపై దాడి చేసి, 250 మి.లీ. పరిమాణం గల 120 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పాలు అత్యంత ప్రమాదకరం..
పాడి పశువుల నుంచి కృత్రిమంగా పాలను పితికేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నారు. దీనివల్ల పశువుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అధికారులు హెచ్చరించారు. ఆక్సిటోసిన్ ప్రయోగించిన పశువుల పాలు తాగడం వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లల్లో బాల్యదశలోనే శారీరక మార్పులు రావడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని... పెద్దవారిలో కంటి చూపు మందగించడం, గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అయ్యే ముప్పు, పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేయడం లేదా విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నేరమని... దీనికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ కె. దాస్, పటాన్‌చెరువు అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాము పర్యవేక్షణలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు ఎం. చంద్రశేఖర్, ఎం. వరప్రసాద్, ఎన్. రవికిరణ్ రెడ్డి, టి. ప్రవీణ్ కుమార్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. అధికారులు శాంపిల్స్‌ను సేకరించి విశ్లేషణకు పంపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి ప్రకటించారు.






