కరీంనగర్‍లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ షాప్‍లో భారీ దోపిడీ

by Prasad Jukanti |   (  Updated:2026-05-03 06:53:02  IST  )

కరీంనగర్‍లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ షాప్‍లో భారీ దోపిడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో/కరీంనగర్: కరీంనగర్‍లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నగరంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

విషమంగా ఒకరి పరిస్థితి..

అందిన సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాప్‍ను తెరిచి లాకర్ల నుంచి డిస్‍ప్లే లో నగలు పెడుతున్నారు. ఆమయంలో రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు మొత్తం 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అంతరాష్ట్ర ముఠా పనేనా..?

ఈ దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా పనేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి అదును చూసి ఎటాక్ చేశారా లేదా అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి కొద్ది సేపటి క్రితమే సీపీ చేరుకున్నారు.

ఉలిక్కిపడిన నగరం..

క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్‌లో పెను సంచలనం సృష్టించింది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

Next Story