పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత శాఖ మంత్రి సీతక్క చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నిర్ణయం ప్రకారం, 27 మంది డిప్యూటీ సీఈఓలు సీఈఓలుగా పదోన్నతి పొందగా, 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలంగా పదోన్నతులు కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఇది ఆనందకరమైన పరిణామంగా నిలిచింది. పదోన్నతులు పొందిన అధికారులు ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. సుదీర్ఘకాలం తర్వాత పదోన్నతులు కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తో పాటు, అర్హత కలిగిన వారికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. శాఖ బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.

అదేవిధంగా, ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఈఓలుగా, 15 మంది డిప్యూటీ సీఈఓల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీడీవోల నుంచి అటెండర్ ల వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మొదటిసారిగా అత్యధిక స్థాయిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా శాఖను బలోపేతం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ చర్యలతో గ్రామీణ స్థాయిలో పరిపాలన మరింత మెరుగుపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీఓ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story