- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడిసిన్ కొనుగోళ్లలో భారీగా అవినీతి.. రూ.150 కోట్ల విలువైన మందులు గోల్మాల్ : బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆరోపణ నిజమైతే ఎవరు బాధ్యులు ఎలా జరిగిందనే విషయాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది అబద్ధ ప్రచారం అయితే ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ఒక్కటే ఆశ్రయం అయినప్పటికీ, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. డాక్టర్ కూర్చుని రోగులను పరిశీలించడానికి సరైన గది కూడా లేకుండా కారిడార్‌లలోనే చికిత్స జరుగుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు అవసరమైన నిధులు హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ ఇతర వనరుల ద్వారా రావాల్సి ఉన్నప్పటికీ, ఆ నిధులు సమయానికి అందడం లేదని ఆరోపించారు. వైద్య వ్యవస్థ నిర్వహణలో ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి.. బయోమెడికల్ వేస్ట్ అనేది సాధారణ చెత్త కాదు.. ఇందులో సిరంజీలు, కెమికల్స్, ఇంజెక్షన్లు, మెడిసిన్స్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి.. వీటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, గాలి, నీటి కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. దీని నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నదని అత్యంత జాగ్రత్తతో చేయాల్సి ఉంటుందని సూచించాచరు.
చిన్న స్థాయి తప్పిదం కాదు..
గత మూడు సంవత్సరాలుగా ఆసుపత్రుల్లో మందులు లేవని తాము అసెంబ్లీలో అనేకసార్లు చెప్పామని గుర్తు చేశారు. ఇప్పుడు గడువు దాటిన మందులు ఉన్నాయని చెబుతున్నారు.. ఆ మందులు ముందుగా ఎందుకు ఉపయోగించలేదు, ఎందుకు పంపిణీ చేయలేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. ఈ వ్యవహారం చిన్న స్థాయి తప్పిదం కాదు.. ఇది పై స్థాయి నుంచి జరిగిన అవినీతి అనే అనుమానం వ్యక్తమవుతోందని ఆరోపించారు. ఇందులో అధికారులు, రాజకీయ నాయకులు లేదా ఇద్దరూ కలిసే బాధ్యులా..? అన్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నస్థాయి ఉద్యోగులను బలి పశువులుగా చేసి అసలు బాధ్యులను తప్పించకూడదు.. ప్రజలకు కనీస వైద్యం కూడా అందని పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు వృధా కావడం చాలా దురదృష్టకరం.. విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజలే దీనిపై తీర్పు చెబుతారని హెచ్చరించారు.






