వీధి కుక్కల ఊచకోత.. ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద జంతు ప్రేమికుల నిరసన

by Ramesh Naini |   (  Updated:2026-01-24 15:49:18  IST  )

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న వీధి కుక్కల సామూహిక హత్యల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

వీధి కుక్కల ఊచకోత.. ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద జంతు ప్రేమికుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న వీధి కుక్కల సామూహిక హత్యల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో సుమారు 300 వీధి కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి చంపారని జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ గేట్ ముందు బైఠాయించి జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో దాదాపు 900 వీధి కుక్కలను చంపారని ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో జంతు హక్కుల కార్యకర్త, మాజీ ఎంపీ మేనకా గాంధీ, సోదరి అంబికా శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘అహింసను బోధించిన మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో, కేవలం వారం రోజుల్లోనే 1,000కి పైగా కుక్కలను అత్యంత కిరాతకంగా చంపడం సిగ్గుచేటు. జంతువులను పూజించే ఈ గడ్డపై, కాలభైరవ స్వరూపంగా భావించే కుక్కలపై ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడటం సహించరానిది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి గ్రామంలో వీధి కుక్కల హత్యలకు సంబంధించి గ్రామ సర్పంచ్ (A1), గ్రామ పంచాయతీ కార్యదర్శి (A2) తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సామూహిక హత్యలకు గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాన సూత్రధారులని ఎఫ్ఐఆర్ (FIR)లో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 325, రీడ్ విత్ 3(5), అలాగే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (PCAA) లోని సెక్షన్ 11(1)(a)(i) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story