- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మున్సిపల్ ఇంజినీరింగ్‌లో రిటైర్మెంట్ సెగ.. భవిష్యత్తు ప్రశ్నార్థకం!
తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్త ఇంజినీర్ల నియామకం లేదుగానీ పదవీవిరమణ పొందేవారి సంఖ్య పెరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్(టీపీహెచ్ఎంఈ) విభాగంలో కొత్త ఇంజినీర్ల నియామకం లేదుగానీ పదవీవిరమణ పొందేవారి సంఖ్య పెరుగుతున్నది. 2025లో 24మంది ఇంజినీర్లు రిటైర్ అయితే 2026లో 25 మంది పదవీవిరమణ పొందనున్నారు. వీరిలో 11మంది సూపరింటెండెంట్ ఇంజినీర్లు, 9మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, ఐదుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్(టీపీహెచ్ఎంఈ) విభాగంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమైంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, మెట్రోరైలు ప్రాజెక్టు, మున్సిపాలిటీల్లో అత్యధిక మంది ఈ విభాగానికి చెందిన వారే ఉన్నారు. పీహెచ్ఎంఈ విభాగానికి 187, కొత్త మున్సిపాలిటీలకు 454, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు 113, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 132 మంది ఇంజినీర్లను కేటాయించాలని ప్రభుత్వానికి 2022 నుంచి పలుమార్లు లేఖలు రాస్తున్నా స్పందన కరువైందని పలువురు ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిని రిక్రూట్ చేసుకోకపోవడంతో పాతవారికి ప్రమోషన్లు కూడా రావడంలేదని రిటైర్‌మెంట్ అవుతున్న అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్, వరంగల్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో వరంగల్ సర్కిల్ పరిధిలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం డివిజన్లు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, మెదక్, మహాబుబ్ నగర్, హైదరాబాద్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్‌లు ఉన్నాయి.
ప్రమోషన్ రాకుండానే..
పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈఎన్సీతో పాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలో ముగ్గురు చీఫ్ ఇంజినీర్ ఇన్‌చార్జి హోదాల్లోనే పనిచేస్తున్నారు. వీరందరికీ రెగ్యులర్ పోస్టులు రావాలంటే ప్రభుత్వ స్థాయిలోని డీపీసీ ఆమోదించాల్సి ఉంది. డీపీసీ జరగాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదనే విమర్శలూ లేకపోలేదు. డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ల(డీఈఈ) నుంచి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ), ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ), సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) నుంచి చీఫ్ ఇంజినీర్(సీఈ) ప్రమోషన్లు రావాల్సి ఉంది. కానీ ప్రమోషన్ రాకుండానే రిటైర్ మెంట్ కావాల్సి వస్తుందని పలువురు ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఏడాదిలో 25 మంది ఇంజినీర్లు..
ఈ ఏడాదిలో డీఈఈ, ఈఈ, ఎస్ఈలకు సంబంధించిన 25మంది ఇంజినీర్లు రిటైర్‌మెంట్ అవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎస్ఈలు, ఇద్దరు ఈఈ, ఇద్దరు డీఈఈలు రిటైర్ అయ్యారు. 2025లో 24 మంది ఇంజినీర్లు రిటైర్ అయ్యారు. వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్ ఇంజినీర్లు(ఎస్ఈ), ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు(ఈఈ) 9 మంది ఉన్నారు. ఈ ఏడాదిలో 25మంది ఇంజినీర్లు రిటైర్ అయ్యేవారి జాబితాలో ఉన్నారు.






