- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్క్సిజం సిద్దాంతం అజేయమైనది : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
మార్క్సిజం సిద్దాంతం అజేయమైనదనీ, అది కింద పడినప్పుడల్లా మరింత రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచిందని సీపీఐ(ఎం ) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు.

దిశ, రాంనగర్ : మార్క్సిజం సిద్దాంతం అజేయమైనదనీ, అది కింద పడినప్పుడల్లా మరింత రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచిందని సీపీఐ(ఎం ) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఐ (ఎం ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభ సూచకంగా గురువారం పార్టీ సీనియర్ నాయకులు సారంపెల్లి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి పెరుగుదలకు ఉత్పత్తి సాధనాలపై ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యం ఆటంకమైనపుడు సామాజిక విప్లవం ద్వారా సోషలిస్టు వ్యవస్థకు పరిణామం చెందటం అనివార్యమని మార్క్స్ నిరూపించాడని చెప్పారు.
ఈ శాస్త్రీయ ప్రతిపాదనలన్నీ మార్క్స్ ఊహించి చేసినవేమీ కావన్నారు. భూమి పుట్టుక నుంచి ప్రకృతి, అందులో భాగమైన మానవ సమాజం నిరంతరాయంగా మారుతూ వస్తోందని చెప్పారు. మార్క్స్ గొప్పదనమంతా గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని అర్థంచేసుకుని, భవిష్యత్తును అంచనా వేయగలిగాడని వివరించారు . ప్రకృతి, మానవసమాజమూ నిరంతరం అభివృద్ధి వైపు మార్పుచెందుతున్నట్లే అందులో భాగమైన మార్కిజం కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుందని చెప్పారు. నూతన అంశాలను ఇముడ్చుకోవటం ద్వారా మార్క్సిజం అభివృద్ధి చెందటం మార్క్స్ కాలంలోనూ జరిగిందని వివరించారు. లెనిన్ కాలంలో అది మరింతగా ముందుకు సాగిందని తెలిపారు. నేడు కూడా అదే జరగాల్సి ఉందన్నారు. నేడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలను ఈ దృష్టితో మనం పరిశీలించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నిజానికి ఈ ఆటంకాలు ఇపుడే కొత్తగా ఏర్పడినవి కావన్నారు. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రంతా పరిశీలిస్తే అనేక సందర్భాలలో ఉద్యమం దారుణంగా దెబ్బతినటం, తిరిగి పుంజుకోవటం, రెట్టింపు బలంతో ముందుకు సాగటం మనం గమనించాలని గుర్తు చేశారు. ఆ ఎత్తు పల్లాలను పరిశీలించి అర్థం చేసుకోవాలని సూచించారు. మార్క్స్, ఎంగెల్స్‌ల కంటే ముందుకూడా కార్మికోద్యమం ఉందన్నారు .అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మికవర్గం పెరిగిందన్నారు. యంత్రాలు రావటం వల్ల తాము పని కోల్పోతున్నామనీ, యంత్రాలను ధ్వంసం చేసే ఉద్యమం మొదలుకుని సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, ఫోరియర్ వగైరా ఊహాజనిత సోసలిస్టుల ప్రయోగాల వరకూ శ్రామికుల స్థితి మెరుగుదలకు అనేక విధాల కృషి జరిగిందన్నారు. అయినా శాస్రీయమైన సిద్ధాంతం లేకపోవటం వల్ల కార్మికోద్యమం అనేక వైఫల్యాలకు గురైందని తెలిపారు . విస్తరణకు కూడా ఆటంకాలేర్పడ్డాయని చెప్పారు. ఈ ఆటంకాల నుండే కార్మికవర్గ విముక్తికి విప్లవ సిద్ధాంతం అవసరమేర్పడిందని తెలిపారు.
ఈ అవసరం నుండే 1948లో మార్క్, ఎంగెల్స్‌లు ఉమ్మడిగా రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ కార్మిక వర్గానికి సిద్ధాంత ఆయుధంగా అందించబడిందన్నారు.శాస్త్రీయ సిద్ధాంతం ఆవిర్భవించాక అనేక ప్రాంతాలకు, దేశాలకు కార్మికోద్యమం వ్యాప్తి చెందిందని తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం ఇంకా అనేక యూరోప్ దేశాలకు ఉద్యమం విస్తరించిందన్నారు. అంతర్జాతీయ సంస్థ ఏర్పడటం వల్ల మరిన్ని దేశాలకు ఉద్యమం విస్తరించిందని గుర్తు చేశారు. అనేక దేశాలలో ‘సోషల్ డెమొక్రటిక్ పార్టీ’ పేరుతో కార్మికుల రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని చెప్పారు. అయితే వీటన్నింటి సమన్వయం కోసం మరో ఇంటర్ నేషనల్ సంస్థ అవసరమైందని తెలిపారు. ఆ ఆటంకాన్ని అధిగమిస్తూ ఎంగెల్స్ నాయకత్వంలోరెండో ఇంటర్నేషనల్ ఏర్పడిందన్నారు. 1870 నుంచి 1900 వరకూ కార్పొరేట్ల ధనికుల పెట్టుబడి బాగా పోగుబడింది. మార్కెట్ల కోసం వీరి గుత్తాధిపత్యంతో అనేక వలసలు ఏర్పడ్డాయన్నారు. మరోవైపు పారిశ్రామికాభివృద్ధి వల్ల కార్మికోద్యమాలు బలపడ్డాయని చెప్పారు. 1902లో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఏర్పడిందన్నారు. ట్రాట్స్కీ, ప్లెఖనోవ్‌లు ప్రముఖ నాయకులుగా ఉన్నారన్నారు. వారి ప్రభావంతో లెనిన్, స్టాలిన్‌లు రంగంలోకి వచ్చారని తెలిపారు . ప్రతి దేశ కమ్యూనిస్టు పార్టీ ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్దం ప్రారంభించాలని కార్మిక ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నించాలని లెనిన్ వాదించాడని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధికున్న ఈ ముఖ్యమైన ఆటంకం తొలగితే, మిగతా ఆటంకాలు బలహీనమవటం, ఉద్యమాలు తిరిగి ఉత్సాహంగా సాగటం తప్పక జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, జూలకంటి రంగారెడ్డి, ఎండి అబ్బాస్, జి.నాగయ్య పాల్గొన్నారు.






