కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మార్కుల గోల్‌మాల్ వివాదం : బాధిత విద్యార్థిని ఆవేదన

by Ramesh Naini |

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ, అండర్‌గ్రాడ్యుయేట్ పరీక్షల్లో మార్కుల అవకతవకలపై ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మార్కుల గోల్‌మాల్ వివాదం : బాధిత విద్యార్థిని ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ, అండర్‌గ్రాడ్యుయేట్ పరీక్షల్లో మార్కుల అవకతవకలపై ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, మార్కుల గోల్‌మాల్‌కు గురైనట్లు ఆరోపిస్తున్న వైద్య విద్యార్థిని హిమజ స్పందించారు. తన పరిశీలనలో స్పష్టమైన అన్యాయం జరిగిందని ఆమె మీడియాతో మాట్లాడారు. పరీక్షలు బాగా రాసినప్పటికీ అనుకోకుండా ఫెయిల్ అయ్యానని, ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా తన ఆన్సర్ షీట్లను మార్చి లేదా కొట్టివేసి ఫెయిల్ చేయించారని హిమజ ఆరోపించింది. ఈ అన్యాయంపై యూనివర్సిటీ వైస్‌-చాన్సలర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే విచారణ కమిటీ ఏర్పడి తనకు న్యాయం జరిగిందని ఆమె వెల్లడించారు. ‘విచారణ కమిటీ లేకపోయి ఉంటే నేను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునే స్థితికి చేరేదాన్ని. నన్ను ఫెయిల్ చేయాలని ఎవరో కుట్ర చేశారు’ అని హిమజ ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ నంద కుమార్ రెడ్డి రాజీనామా చేసిన వార్త తెలిసి బాధ కలిగిందని కూడా తెలిపారు.

ఇదిలా ఉండగా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ, అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య పరీక్షల మార్కుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వీసీపై వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు విచారణ జరిపి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాయి. రీకౌంటింగ్‌ బదులు రీవాల్యుయేషన్ చేయించి పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రైవేటు మెడికల్ కళాశాలల తనిఖీల్లో అక్రమాలు జరగడం వంటి పలు అంశాలు విచారణలో బయటపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారుల సూచనతో వీసీ నంద కుమార్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story