తెలంగాణలో మావోయిస్టుల పతనం.. మిగిలింది కేవలం 17 మంది: డీజీపీ

by Ramesh Naini |   (  Updated:2026-01-03 16:09:23  IST  )

మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ సరెండర్‌తో తెలంగాణ స్టేట్ కమిటీ ఆల్ మోస్ట్ కొలాప్స్ అయిపోయిందని, ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో మావోయిస్టుల పతనం.. మిగిలింది కేవలం 17 మంది: డీజీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ సరెండర్‌తో తెలంగాణ స్టేట్ కమిటీ ఆల్ మోస్ట్ కొలాప్స్ అయిపోయిందని, ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు ఇప్పటి వరకు 55 మంది ఉన్నారని భావించామని, కానీ తాజాగా లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం నుంచి నుంచి కేవలం 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని తెలిపారు. కేంద్ర కమిటీలో ఉన్న 7గురు సభ్యులలో తెలంగాణకు చెందిన వారే నలుగురు ఉన్నాయని ఆయన వివరించారు. స్టేట్ కమిటీలో ఐదుగురు, డివిజనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ఏరియా కమిటీ మెంబర్లు నలుగురు, పీఎంఎస్ ఒక్కరు మాత్రమే ఉన్నారని తెలిపారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటి కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.

సెంట్రల్ కమిటీ సభ్యులపై రూ. 25 లక్షలు రివార్డు

సెంట్రల్ కమిటీ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించింది. స్టేట్ కమిటీ సభ్యులపై రూ.20 లక్షలు ప్రకటించింది. సెంట్రల్ కమిటి మెంబర్‌గా ఒడిశా రాష్ట్ర కమిటి సెక్రటరీ పాక హనుమంతు అలియాస్ గణేష్ ఇటివల ఎన్ కౌంటర్‌లో మృతి చెందడం, సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, మరో సెంట్రల్ కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనా బాయి, అలియాస్ మైనక్క అలియాస్ సుజాత లొంగిపోవడంతో తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో ఉన్న వారి సంఖ్య నలుగురిగా భావిస్తున్నారు. 2024 లో 11 మంది సభ్యులు తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

Next Story