- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజ్ఞాతం వీడినా ఇంటికి చేరని మావోయిస్ట్ సుజాతక్క.. ఇంతకూ ఆమె ఎక్కడ..?
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన ఇటీవల తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

దిశ, గట్టు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన ఇటీవల తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే సరేండర్ అయ్యి వారం రోజులు కావస్తున్నప్పటికీ సూజాతక్క ఎక్కడ ఉన్నదనే దానిపై స్పష్టత రావడం లేదు. నాలుగున్నర దశాబ్దాల క్రితం అడవి బాటపట్టిన ఆమె.. సెప్టెంబర్ 13, 2025న అజ్ఞాతవాసం వీడారు. అయితే ఆమె నేరుగా తన స్వగ్రామం వెళ్తుందని అందరూ భావించినా అక్కడికి ఇప్పటి వరకు వెళ్లలేదు.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన పద్మ 45 ఏళ్ల క్రితం అడవిబాట పట్టారు. అప్పటి నుంచి పద్మ రాకకోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం సుజాతక్క లొంగిపోయినట్టు డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆమె పేరిట ఉన్న రూ.25 లక్షల రివార్డును అందజేశారు. అయితే ఈ విషయాన్ని టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంబురపడ్డారు. పద్మక్క మళ్లీ తమ ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఐదు రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నది అనే దానిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో గురువారం ఆమె ఆచూకీ తెలపాలని తహసీల్దార్ ఆఫీసులో కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు.
అజ్ఞాతం వీడిన పద్మను తమకు అప్పగించాలని కోరారు. దీంతో తహసీల్దార్ రాజు పెంచికలపాడు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులను, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె సోదరులతోనూ మాట్లాడి పంచామానా నిర్వహించారు. తహసీల్దార్ వెంట వీఏఓ రంగన్న, సిబ్బంది గోపాల్, పరశురాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వడ్ల భీమప్ప, జంగిటి సుంకన్న, దెయ్యం చౌడప్ప, వుల్లి గోవిందు, గాజుల గంగప్ప, నర్సింహులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.






