మావోయిస్టు పార్టీకి శరాఘాతం.. డీజీపీ సమక్షంలో మరో 41 మంది సరెండర్

by Kema Shiva Kumar |

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

మావోయిస్టు పార్టీకి శరాఘాతం.. డీజీపీ సమక్షంలో మరో 41 మంది సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 41 మంది మావోయిస్టు క్యాడర్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ లొంగుబాటుతో పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. లొంగిపోయిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ (DVCM), 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కోర్సా లచ్చు (CYPCM), కనికారపు ప్రభంజన్, అర్బన్ ఏరియా, పీడీఎస్‌యూ సభ్యుడితో పాటు ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMs), 12 మంది ఏరియా కమిటీ సభ్యులు (ACMs) 23 మంది పార్టీ సభ్యులు (PMs) ఉన్నారు. ఈ మేరకు వారి నుంచి ఒక INSAS LMG గన్స్, మూడు AK-47 రైఫిల్స్, ఐదు SLR రైఫిల్స్, ఏడు INSAS రైఫిల్స్, ఒక BGL గన్, నాలుగు UBGL తుపాకులు, ఒక 303 రైఫిల్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGL షెల్స్, 08 షెల్స్ సహా భారీ మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల మొత్తం విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒత్తిడితోనే బయటకు వచ్చేశాం..

పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, క్షేత్రస్థాయి కేడర్లను తమకు ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రాంతాలకు పంపడం, స్థానిక ప్రజల మద్దతు కరువవ్వడం పోలీసుల నిరంతర ఒత్తిడి కారణంగా తాము బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా మావోయిస్టులు వెల్లడించారు. ముఖ్యంగా అడవిలో సరైన సౌకర్యాలు లేకపోవడం, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై ఉన్న నమ్మకం జనజీవనం స్రవంతిలోకి వచ్చేలా చేశాయని వారు వెల్లడించారు.

ప్రభుత్వ సహకారం ఉంటుంది.. డీజీపీ శివధర్‌రెడ్డి

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారకికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. ప్రతి ఒక్కరికీ పునరావాసం ప్యాకేజీ కింద లొంగిపోయిన 41 మందికి కలిపి ప్రభుత్వం తరఫున మొత్తం రూ.1.46 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లుగా తెలిపారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇవాళ పంపిణీ చేస్తున్నామని అన్నారు. వాటితో పాటు ఆయుధాలకు విడిగా నగదు బహుమతిని కూడా ప్రభుత్వం అందిస్తుందని.. వాటిలో ఎల్ఎంజీ రైఫిల్‌కు రూ.5 లక్షలు, AK-472కు 4 లక్షలు ఇస్తామని అన్నారు.

Next Story