- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist party: మల్లోజుల, ఆశన్న లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులుగా మారారని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస లొంగుబాట్లపై (Maoists surrenders) మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తమ అనుచరులతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీశ్‍లు విప్లవ ద్రోహులుగా మారారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. వారు కేంద్ర కమిటీతో చర్చించకుండానే తమ అనుచరులతో లొంగిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ (Abhay) పేరుతో తాజాగా లేఖను విడుదల చేసింది. విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకారులు, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది. వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొంది. పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను శత్రువులకు అప్పగించారని ఈ చర్య విప్లవ ద్రోహం, పార్టీ విచ్చిన్నకర చర్య అని పేర్కొన్నారు.
2011 చివరి నుంచి విప్లవోద్యంమం గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వస్తోంది. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురయ్యాయి. అప్పటి నుంచి మల్లోజుల రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయని 2020 డిసెంబర్ లో జరిగిన కేంద్ర కమిటీ సమావశంలో దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలను మల్లోజుల స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమ్రశించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలో సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందుమోకరిల్లేలా చేశాయి.
ప్రాణత్యాగానికి సిద్ధపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాలను, తన వాదనలను కేంద్ర కమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో నిజాయితీ ఉందని అంగీకరించేవాళ్లం. కానీ అందుకు సిద్ధపడకుండా పార్టీ నిర్మాణ పద్దతిని పాటించకుండా శత్రువుల ముందు లొంగిపోయాడు అంటేనే మల్లోజులలో నిజాయితీ లేదని కేవలం ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదం అని తేలిపోయిందని లేఖలో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీ కమిటీ సభ్యులతో పార్టీని చీల్చే కుట్రకు మల్లోజుల పూనుకున్నాడని ఆరోపించారు. పార్టీ రాజకీయ-సైనిక పంథాలపై దృఢంగా నిలబడిన పార్టీ కమిటీ సభ్యులను, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను పథకం ప్రకారం దూరం పెడుతూ వచ్చారని ఇవి అరాచకవాద, పార్టీ విచ్ఛిన్నకర చర్యలేనని పేర్కొన్నారు.
సోను ఆయన అనుచరులు శత్రువులకు లొంగిపోతే లొంగిపోవచ్చు. కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించాలనే పార్టీ నిబంధనలు పాటించకుండా 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించారని రాశారు. ఎందరో కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలర్పించి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని శత్రువులకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడానికి/ విప్లవకారులను హత్య చేయమని శత్రువులకు అందించడమేనని మండిపడ్డారు. విప్లవ ద్రోహిగా మారిన మల్లోజులను ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీ కమిటీ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎంతో మల్లోజులకు సంబంధాలు:
గతేడాది చివర్లో తన జీవిత సహచరిని, మరికొందరిని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందిచినప్పటి నుండే మల్లోజుల ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాల్లో ఉన్నాడని ఇటీవల జరుగుతున్న పరిణామాల ద్వారా అర్థం అవుతోందని ఆరోపించారు. విప్లవ పార్టీలో ఉంటూనే శత్రువుతో సంబంధాలు కొనసాగించడం అంటే కోవర్డుగా మారడమేనని ఇలాంటి విప్లవ ద్రోహికి, కోవర్టుకు నూతన పద్దతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తానని అనడానికి నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. మల్లోజుల ఆయన 61 మంది అనుచరులు లొంగిపోవడం వల్ల విప్లవోద్యమానికి నష్టం తాత్కాలికమేనని దీని ప్రభావం దీర్ఘకాలం ఉండదన్నారు. కొందరు పార్టీ నాయకులు, కొందరు ప్రజాసైన్యం కమాండర్ల లొంగుబాట్లతో విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదని పేర్కొన్నారు.శత్రువుకు లొంగిపోయిన విప్లవద్రోహానికి పాల్పడిన మల్లోజుల విప్లవోద్యమాన్ని నూతన పంథాలో నిర్మిస్తాననటం బూటకం అన్నారు.
మంత్రితో సంబధాలు:
ఈ విప్లవద్రోహంలో మల్లోజులతో భాగస్వామిగా ఉన్న డీకే ఎస్.జెడ్.సి నార్త్ జోనల్ బ్యూరో ఇన్ చార్జి సతీశ్, ముగ్గురు ఎస్.జెడ్.సీ.ఎంలు సంతూ, భాస్కర్(రాజ్ మన్), రనీతలు 150 మందితో కలిసి ఆయుధాలతో లొంగిపోయారనే వార్త వచ్చింది. ఈ నలుగురు ఎస్.జెడ్.సీ.ఎంలు మల్లోజులలాగే పార్టీని చీలదీసి పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహులుగా మారిపోయారని ఆరోపించారు. సతీశ్ గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు మంత్రితో సంబంధాల్లో ఉంటూ కోవర్టుగా వ్యవహరించినట్లు ఈ మధ్య పరిణామాల ద్వారా అర్థం అవుతుందన్నారు. మల్లోజుల, సతీశ్ లో దశాబ్ద కాలం నుంచి కొనసాగుతున్న మితవాద భావాలు క్రమంగా మితవాదంగా మారి కగార్ యుద్ధంతో అతి మితవాద అవకాశ వాదంగా మారి ఇప్పుడు విప్లవ ద్రోహంగా, విప్లవ ప్రతిఘాతక స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని సకాలంలో సరిగా అంచనా వేయడంలో మేము విఫలం అయ్యాం. ఈ వైఫల్యత ఫలితంగా వాళ్లిద్దరు తమ నాయకత్వ స్థానాలను ఉపయోగించుకుని విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించారని ఈ పరిణామాలను సమీక్షించుకుని తగిన గుణపాఠాలు తీసుకుంటామని తెలిపారు.
తన్ని తరమండి:
విప్లవానికి ద్రోహులుగా మారిన మల్లోజుల సతీశ్ ముఠా సరైన మార్గంలో వివ్లవోద్యమాన్ని పునర్మిర్మిస్తామనడం బూటకం అని ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్ని తరమాల్సిందిగా పిలుపునిస్తున్నామన్నారు. మల్లోజుల, సతీశ్‍లో విప్లవ ద్రోహాన్ని ఇప్పటికైనా, ఇకముందయినా అర్థం చేసుకుని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు, పీ.ఎల్.జీ.ఏ.సభ్యులకు విజ్ఞుప్తి చేస్తున్నామని అలాంటి వారికి పార్టీ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పార్టీని చీలదీసే విప్లవ ప్రతిఘాతక కార్యకలాపాలను ఇకనైనా ఆపేయాలని మల్లోజుల, సతీశ్ లను హెచ్చరించారు.
లొంగిపోతే లొంగిపోండి కానీ..
ఆపరేషన్ కగార్‍తో ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోదలిస్తే లొంగిపోవచ్చు కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది విప్లవ ద్రోహం మాత్రమే కాదని విప్లవ ప్రతిఘాతకత అవుతుందని రాశారు. విప్లవ ప్రతిఘాతకులను విప్లవ ప్రజలు శిక్షించక తప్పదని పేర్కొన్నారు. మారుతున్న విప్లవ యుద్ధ స్వభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ-సైనిక పంథా మరింత సంపన్నం చేసుకుని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్ధామని యావత్ దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. విప్లవోద్యమంలో వెనకంజలు, ఓటములు తాత్కాలికమేనని మల్లోజుల, సతీశ్ ముఠాల ద్వారా సృష్టించబడ్డ ఈ స్థితిని పార్టీలో ఏర్పడిన సంక్షోభంగా గుర్తించి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం అని పిలుపునిచ్చారు. మల్లోజుల, సతీశ్‍లు సరెండరైనా రేపు మరొకరు లొంగిపోయినా పార్టీ మాత్రం శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. వర్గాలున్నంతకాలం ఈ వర్గపోరాటాలు వాటి ఉన్నత రూపాలుగా ప్రజా యుద్ధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.






