- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist party: మల్లోజుల, ఆశన్నలకు ఆ హక్కే లేదు.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
అవకాశవాదంతో విచ్ఛిన్నకర వైఖరితో మల్లోజుల, ఆశన్న కేడర్‍ను మోసగించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయంగా దిగజారిన సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, సతీశ్ అలియాస్ ఆశన్నలకు తమ పంథాను తప్పు పట్టే హక్కు లేదని మావోయిస్టు పార్టీ (Maoist Party) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు అవకాశవాదంతో విచ్ఛిన్నకర వైఖరితో కేడర్‍ను మోసగించి వారిని వెంట తీసుకువెళ్లి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారని ధ్వజమెత్తింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా లేఖను (Abhay Letter) విడుదల చేసింది. మల్లోజుల(Mallojula Venugopal), ఆశన్నలు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకుని పథకం ప్రకారం లొంగిపోయారని, వీరి సంప్రదింపుల మేరకే రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇంద్రావతి నది తీరం, దాని సమీప ప్రాంతాల్లో అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 16వ తేదీల్లో వీరు లొంగిపోయే వరకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి లొంగుబాటుకు మార్గం సుగమం చేశాయని ఈ లేఖలో ఆరోపించారు. గడిచిన దశాబ్దాల తమ రాజకీయ జీవితాన్ని మల్లోజుల, ఆశన్నలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ రకంగా ముగించుకున్నారని విమర్శించారు.
దిగజారుడు తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం:
ప్రభుత్వానికి లొంగిపోయిన మల్లోజుల, ఆశన్నలు (Asanna) తమ రాజకీయ దిగజారుడు తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పు పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత కాల పరిస్థితుల అనుగుణంగా మార్పుల కారణంగా సాయుధ పోరాటాన్ని విరమించి బహిరంగ ప్రజా పోరాటాలలో పాల్గొంటామని చెబుతున్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎన్‍కౌంటర్ కావడానికి ముందు ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది శుద్ధ తప్పు అని మల్లోజుల, ఆశన్నలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు సంబంధించి ఆశన్న అవగాహనలో ఉన్న లోపాలను వివరిస్తూ నంబాళ్ల కేశవరావు అతనికి ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలలో ఆయుధాలు విడిచిపెడ్డటం గురించి పార్టీ ఆలోచించకూడదని అటువంటిదేమైనా ఉంటే అది కేంద్ర కమిటీ మాత్రమే ఆలోచించాల్సిన విషయం అని నంబాళ్ల వివరించారని పేర్కొన్నారు. ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఆయా దేశాలలో తీవ్రమైన నిర్బంధం ఎదురైనప్పుడు విప్లవ పార్టీలు అనేక నష్టాలు చవి చూశాయని, ప్రజలు కష్టాల పాలయ్యారని ఆ లేఖలో నంబాళ్ల పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‍లో ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో 2024 ఫిబ్రవరి, ఆగస్టులలో రూపొందించిన ఎత్తుగడలను అమలు చేసేందుకు దృఢంగా పూనుకోవాలని వివరించారు. కాబట్టి ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు వెళదామన్నది నంబాళ్ల అభిప్రాయం కాదని అభయ్ స్పష్టం చేశారు.
నాడు చెప్పకుండా నేడు విమర్శలా?ప్రపంచీకరణ కారణంగా దేశ కాల పరిస్థితులలో వచ్చిన మార్పుల గురించి కేంద్ర కమిటీ 2021లోనే చర్చించి 'భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పులు- మన రాజకీయ కార్యక్రమం' దస్తావేజును రూపొందించిందని ఈ దస్తావేజుతో మల్లోజుల, ఆశన్న నాడు విభేదం వ్యక్తం చేయకుండా ఇప్పుడు తమ అభిప్రాయాలను దస్తావేజుకు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిజానికి వారు దేశ పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే పార్టీకి ఉపయోగపడేది. పార్టీలో అంతర్గత చర్చ కొనసాగించి ఉంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ తామున్న బాధ్యతాయుత స్థానాలను, కేడర్ లలో రాజకీయ అధ్యయనంలో ఉన్న బలహీనతలను వినియోగించుకుని కేడర్ ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కొందరు ఎస్‍జడ్‍సీ సభ్యులు కూడా ఈ తప్పుడు సూత్రీకరణలను ఆమోదించి వీరితో కలిసి లొంగిపోవడం వారిలో అధ్యయన లేమిని తెలియజేస్తోందని విమర్శించారు.
వాటికి వివరణ ఇవ్వండి:
తీవ్రమైన నష్టాల వల్ల పార్టీలు వ్యూహం మార్చుకోవని వ్యూహం అనేది దేశ కాల పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. మల్లోజుల, ఆశన్నలు మారిన పరిస్థితులంటున్న విషయానికి వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. పైపై మాటలు రాజకీయ చర్చ కాదు. వారి అవగాహన, ద్రోహం ప్రాణ భయంతో వచ్చినవే తప్ప మరేమి కాదని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ఎన్నడూ తన లోపాలను, పొరపాట్లను కప్పిపుచ్చుకోదని విప్లవోద్యమంలో జరిగిన పొరపాట్లను విశ్లేషించి కేంద్ర కమిటీ 2020లో రూపొందించిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో పేర్కొందని రాశారు. వీటి గురించి పార్టీలోని సభ్యుల నుంచి పై స్థాయి కమిటీల వరకు ఎవరైనా చర్చించే హక్కు, మార్పులు, చేర్పులు చేసే హక్కు ఉంటుంది. కానీ ఈ దస్తావేజుపై అభ్యంతరాలు చెప్పని మల్లోజుల, ఆశన్న ఇప్పుడు కేంద్ర కమిటీ అన్నీ తప్పులే చేసిందంటూ సోను ప్రజలకు క్షమాపణలు చెప్పడం, ఇక పార్టీ ఏం చేయలేదని అందరం చచ్చిపోవడం లేదా సరెండర్ కావడమే మిగిలిందంటూ ఆశన్న చేసిన వ్యాఖ్యలు వారు ఇంతకాలం నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధం అన్నారు. నిజమైన కమ్యూనిస్టులు గతితార్కిక భౌతిక వాద దృష్టితో చూస్తారని అప్పుడే ప్రతి అంశంలోనూ ఉన్న పాజిటివ్ నెగిటివ్ అంశాలను అర్థం చేసుకోగలరను రాశారు. ఇలా చేయకపోతే పెడధోరణి పట్టి ఒక కొసకు వెళ్లిపోతారని మల్లోజుల, ఆశన్న లు చేసింది ఇదేనని రాశారు.
నిజాయితీ కొరవడటంతోనే..
పరిస్థితులకు తగిన విధంగా ఎదగకపోవడం, వారి లోపాలపై తమ కంటే కింది స్థాయి కమిటీల నుంచి వస్తున్న విమర్శలను స్వీకరించి సరిదిద్దుకోవాలన్న నిజాయితీ కొరవడటంతోనే వీరు ఈ స్థితికి చేరుకుని ఇప్పుడు కేంద్ర కమిటీపైనే దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. కేంద్ర కమిటీ సభ్యునిగా మల్లోజుల కమిటీలో చర్చ చేయకుండా, కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా నిరాకరించిన తన అభిప్రాయాలను ప్రజలకు అప్పీల్ పేరుతో బహిరంగం చేయడం అతని రాజకీయ దిగజారుడు తనాన్ని, అవకాశవాదాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. ఎస్ జెడ్ సీ స్థాయిలో ఆశన్న కేంద్ర కమిటీ అందించిన సైద్ధాంతిక, రాజకీయ అవగాహనను ఎత్తుగడలను చొరవతో అమలు చేయగలిగితే ఉద్యమానికి ఎంతగానో ఉపయోగపడేదని కానీ అలా చేయకుండా సొంత ఆలోచనలతో కొనసాగాడని ఆరోపించారు. ఈ ఇద్దరు శత్రు నిర్బంధాన్ని అతిగా అంచనా వేసుకున్నారని తమ అవగాహనా, ఆచరణ లోపాలను కప్పి పుచ్చుకుని కేడర్‍ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ ఏడాది ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించడం, ఆపరేషన్ కగార్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 16 మంది రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో డీవీసీ, ఏసీ స్థాయి సభ్యులు, పార్టీ పీఎల్ జీఏ సభ్యులు చనిపోవడంతో ఈ నష్టాన్ని నివారించుకోలేకపోతున్నామన్న ఆందోళనకు గురై మల్లోజుల, ఆశన్నలు చెప్పింది నమ్మారు. ఇది వారి అవగాహన లోపం అని ప్రజలు వారిపై పెట్టుకున్న ఆశలను మరోసారి గుర్తు చేసుకుని వారంతా పునరాలోచించాల్సింగా కోరాతున్నామన్నారు.
కేంద్ర కమిటీ నిర్ణయాలు అమలు చేయడంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి, లోపాలు జరిగాయని అయితే వీటిని అధిగమించడం అసాధ్యమేమి కాదని రాశారు. ప్రకృతిలో తుపానులు, కరువులు, వ్యాధులతో మరణాలు ఉన్నట్టుగానే విప్లవంలో నిర్బంధాలు, పారుబోతుతనాలు, నష్టాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణాలు అర్పించాలన్న అంకిత భావంతో విప్లవంలోకి వచ్చిన వారు చివరి వరకు కొనసాగుతారని అలా కాకుండా విప్లవవానికి ద్రోహం తలపెట్టాలని కుటిల బుద్ధితో ఉన్నవారు విప్ల సిద్ధాంతంపై, రాజకీయ పంథాపై పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను, కేడర్ ను గందరగోళానికి గురి చేస్తారని పేర్కొన్నారు. తెలిసీ తెలియకుండా తప్పుదోవ పట్టిన వారు సరైన పద్ధితిలో ఆలోచిస్తే ఎప్పటికైనా తిరిగి విప్లవం పక్షం వస్తారని, వర్గ రాజకీయాలను గుర్తించిన విప్లవ కేడర్ లు ప్రజలు ఈ అవకాశవాదుల మూర్ఖపు మాటలు నమ్మరని పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీ సమసమాజ స్థాపనతో అంతిమంగా విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






