అభయ్ పేరుతో సోనూ కుట్రలు.. ఆయుధాలు అప్పగించేది లేదని ప్రకటించిన మావోయిస్టు పార్టీ

by Gantepaka Srikanth |

మావోయిస్టు పార్టీ(Maoist Party)లో చీలికలు, కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అంగీకారం అంటూ వస్తోన్న వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది.

అభయ్ పేరుతో సోనూ కుట్రలు.. ఆయుధాలు అప్పగించేది లేదని ప్రకటించిన మావోయిస్టు పార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)లో చీలికలు, కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అంగీకారం అంటూ వస్తోన్న వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ మేరకు సోమవారం అధికార ప్రతినిధి అభయ్‌(Maoist Abhay), దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వికల్ప్(Maoist Vikalp) పేరిట లేఖ విడుదల అయింది. ఇందులో ఆయుధాలు అప్పగించడం, ప్రధాన స్రవంతిలో కలిసిపోవడం తమ విధానం కాదని మావోయిస్టు పార్టీ మరోసారి స్పష్టం చేసింది. విప్లవ పోరాటం కొనసాగించటమే పార్టీ ధర్మం నొక్కి చెప్పింది. కాల్పుల విరమణ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు అబద్ధమని పేర్కొంది. శాంతి చర్చలకు సిద్ధమని అభయ్ పేరిట కామ్రేడ్ సోనూ చేస్తున్న ప్రకటనలు పచ్చి అబద్ధం. ఇవి అతని వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇది పార్టీ నిర్ణయం కాదు. ఇందులో పోలీసుల కుట్ర కూడా ఉంది. ఈ విధమైన అబద్ధపు ప్రచారం పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. దివంగత బసవరాజు ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ ఇచ్చిన ప్రకటనలోని అంశాలను అభయ్ పేరుతో సోనూ మసిబూసి మారేడు కాయ చేశాడు. సోనూది దుష్ట పన్నాగం. ప్రజలను పార్టీ కేడర్లను గందరగోళపర్చడానికి చేసే ప్రయత్నం మాత్రమే అని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.

సోనూ లాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు. కామ్రేడ్ బసవరాజు చూపించిన మార్గంలో కొనసాగుతుంది. పీడిత వర్గాల కష్టాలు తీరాలంటే సామాజిక న్యాయం, విప్లవం తప్ప మరో మార్గం లేదనేది పార్టీ అభిప్రాయం. సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నాం. పెరుగుతున్న దోపిడీ, నిరుద్యోగం, సామాజిక అసమానతల పరిస్థితుల్లో ప్రజా యుద్ధం, వర్గ పోరాటం కొనసాగించడమే మా ధర్మం, విప్లవ పోరాటమే మా మార్గం అని మావోయిస్టు పార్టీ పునరుద్ఘాటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేలా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు ఒత్తిడి తేవాలి విజ్ఞప్తి చేసింది.










Next Story