మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గ‌ణేష్‌కు క‌న్నీటి వీడ్కోలు..! స్వ‌గ్రామంలో ముగిసిన అంత్య‌క్రియ‌లు

by Bhanu |   (  Updated:2025-06-20 13:27:26  IST  )

మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అంత్యక్రియలు శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న స్వ‌గ్రామం వెలిశాల‌లో ముగిసాయి.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గ‌ణేష్‌కు క‌న్నీటి వీడ్కోలు..! స్వ‌గ్రామంలో ముగిసిన అంత్య‌క్రియ‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అంత్యక్రియలు శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న స్వ‌గ్రామం వెలిశాల‌లో ముగిసాయి. గ‌ణేష్‌కు జోహార్లు..మ‌ళ్లీ పుట్టాలి ర‌వ‌న్న‌..నీకోసం ఎదురు చూస్తోంది వెలిశాల అంటూ గ్రామ‌స్థులు, విప్ల‌వ‌కారులు, మాజీ మావోయిస్టులు నినాదించారు. అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న విమ‌ల‌క్క ర‌వ‌న్న‌పై ప్ర‌త్యేకంగా విప్ల‌వ గీతం ఆల‌పించింది.రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వేలాది మంది జ‌నం త‌ర‌లివ‌రావ‌డంతో వెలిశాల గ్రామం కిక్కిరిసింది.

వెలిశాల గ్రామాన్ని అనుసంధానం చేసే మార్గాల్లో వాహ‌నాల‌ర‌ద్దీ కొన‌సాగింది. దాదాపు ఒక‌టిన్న‌ర‌కు మొద‌లైన అంతియ‌యాత్ర నాలుగున్న‌ర గంట‌ల పాటు కొన‌సాగింది. 5గంట‌ల స‌మ‌యంలో గ్రామంలో అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. నివాళుల‌ర్పించిన వారిలో చెరుకు సుధాక‌ర్‌, గ‌ద్ద‌ర్ కొడుకు సూర్యం, జ‌న‌శ‌క్తి అమ‌ర్‌.. విమ‌ల‌క్క‌, గాదె ఇన్న‌య్య‌, భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ స్పీక‌ర్ మ‌ధు సూద‌నాచారితో పాటు వివిధ సంఘాల నేత‌లు, మాజీ మావోయిస్టు నేత‌లు పెద్ద సంఖ్య‌లో వెలిశాల‌కు త‌ర‌లివ‌చ్చి గ‌ణేష్‌కు నివాళుల‌ర్పించారు.

ఉద‌యం 8గంట‌ల‌కు గ్రామానికి రాక‌..!

అంత‌కుముందు పోస్టుమార్టం అనంత‌రం గురువారం రాత్రి రంప‌చొడ‌వ‌రం పోలీసులు గ‌ణేష్ కుటుంబ స‌భ్యుల‌కు మృత‌దేహాన్ని అప్పగించారు. అక్క‌డి నుంచి గురువారం అర్ధ‌రాత్రి త‌ర్వాత బ‌య‌ల్దేరిన కుటుంబ స‌భ్యులు గ‌ణేష్ స్వ‌స్థ‌ల‌మైన భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమ‌ట్ల మండ‌లం వెలిశాల గ్రామానికి చేరుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 8గంట‌ల స‌మ‌యంలో గ్రామానికి గ‌ణేష్ భౌతిక‌కాయాన్ని తీసుకువ‌చ్చారు. ర్యాలీగా వెలిశాల‌లోని ఇంటి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా దారిపొడ‌వునా క‌ళాబృందాలు, మాజీ మావోయిస్టులు విప్ల‌వ గీతాలు.. గాజ‌ర్ల ర‌వ‌న్న‌కు జోహార్లు..అని నిన‌దించారు. ఇంటి వ‌ద్ద మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర వ‌ర‌కు సందర్శ‌కుల‌కు కోసం ఉంచారు. ఈసంద‌ర్భంగా రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వేలాదిమంది మావోయిస్టు సానుభూతిప‌రులు, వివిధ రంగాల‌కు చెందిన వారు వెలిశాల‌కు చేరుకున్నారు.

ఎర్రుపెక్కిన వెలిశాల‌..!

గ‌ణేష్ అంత్య‌క్రియ‌ల నేప‌థ్యంలో వెలిశాల గ్రామం ఎరుపెక్కింది. గ‌ణేష్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన క్రమంలో గ్రామం తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతిపరులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో గ్రామానికి వచ్చారు. ఇప్పటికే గాజర్ల కుటుంబంలో ఆరుగురు ఉద్యమంలో అమరులయ్యారు. గ్రామంలో పలుచోట్ల గ‌ణేష్ ఫ్లెక్సీల‌ను అభిమానులు..కుటుంబ స‌భ్యులు ఏర్పాటు చేశారు. గ‌ణేష్ ఆశ‌య సాధ‌న‌ను కొనియాడారు.

Next Story