కొమురంభీం జిల్లాలో మావోయిస్టుల కలకలం.. గడ్చిరోలి దళం చొరబాటుతో హై అలర్ట్

by Kema Shiva Kumar |

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది.

కొమురంభీం జిల్లాలో మావోయిస్టుల కలకలం.. గడ్చిరోలి దళం చొరబాటుతో హై అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) ప్రాంతం నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. ఆసిఫాబాద్ (Asifabad), తిర్యాణి (Tiryani) మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో గ్రేహౌండ్స్ బలగాలు రంగంలోకి దిగాయి. డోర్లి - పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని బలగాలు గుర్తించాయి. పోలీసుల రాకను గమనించిన దళ సభ్యులు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

సరిహద్దుల్లో హై టెన్షన్..

గ్రేహౌండ్స్ బలగాల (Greyhounds Forces)తో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను కఠినతరం చేశారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. తిర్యాణి మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించవద్దని కోరుతున్నారు. ‘ఆపరేషన్ కగార్’‌ (Operation Kagar)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ సమీపిస్తున్న తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడైన ఎదురుకాల్పులు జరగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Next Story