- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MD Muneer: జర్నలిస్ట్ మునీర్ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురి సంతాపం
సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో/ దిశ ప్రతినిధి, నిర్మల్: సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (MD Muneer) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. మందమర్రిలో సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన ఆయన జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా ఎండీ మునీర్ గుర్తింపు తెచ్చుకున్నారు. వామపక్ష భావజాలంతో అనేక విప్లవ ఉద్యమాలు నడిపారు. ప్రధానంగా సింగరేణిలో జర్నలిస్టుగా కార్మికుల పక్షాన నిలిచారు. ఈ సమయంలో పలు పత్రికల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి జేఏసీ చైర్మన్‌గా ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఉద్యమ సంఘాలను ఏకం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మునీర్ అంత్యక్రియలు మంచిర్యాల జిల్లా స్వగ్రామం మందమర్రిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురి సంతాపం..
సీనియర్ పాత్రికేయుడు ఎండీ మునీర్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావం కలిగిన ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సందర్భంగా మునీర్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ, వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిబద్ధత కలిగిన పాత్రికేయునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన మునీర్ కృషి గొప్పదన్నారు. టీజేఎఫ్ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో సింగరేణి ప్రాంత ప్రజా సంఘాలను ఉద్యమ శక్తులను సమన్వయం చేయడంలో వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుగా ఎండీ మునీర్ సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మునీర్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, జర్నలిస్ట్ మునీర్ మృతి పట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, కేటీఆర్, సీనియర్ నేతలు, సింగరేణి అధికారులు, జర్నలిస్టులు, కార్మిక సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.






