టీడబ్ల్యూజేఎఫ్ నుంచి పలువురి బహిష్కరణ

by Kema Shiva Kumar |

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TJWF) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్‌కుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితూడి బాపూరావును సంఘం నుంచి రాష్ట్ర కార్యవర్గం బహిష్కరించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య తెలిపారు.

టీడబ్ల్యూజేఎఫ్ నుంచి పలువురి బహిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TJWF) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్‌కుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితూడి బాపూరావును సంఘం నుంచి రాష్ట్ర కార్యవర్గం బహిష్కరించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య తెలిపారు. కొంతకాలంగా వీరంతా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ఐక్యతకు భంగం కలిగిస్తున్నారని కార్యవర్గం పేర్కొన్నారు. కుల, మత, వర్గ ప్రస్తావనలు తెస్తూ సంఘంలో అనైక్యతకు కారణమవుతున్నారని తెలిపారు.

అదేవిధంగా సంఘం పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. సంఘం సభ్యత్వ రుసుంను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సంఘం వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సంఘం విభజనకు దారితీసేలా పోస్టులు పెడుతున్నారని.. గ్రూపులు, ముఠాలను ప్రోత్సహిస్తున్నారని.. పద్ధతి మార్చుకోవాలని అనేక పర్యాయాలు సూచించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. సంజాయిషీ కోరుతూ రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రధాన కార్యదర్శి మూడుసార్లు నోటీసులు పంపినా అధ్యక్షుడు మామిడి సోమయ్యతోపాటు ఇతరులు బేఖాతరు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి వారిని శాశ్వతంగా బహిష్కరించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక నుంచి వీరు నిర్వహించే సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు టీడబ్ల్యూజేఎఫ్‌కు సంబంధం లేదని.. ఈ విషయాన్ని జర్నలిస్టు గమనించాలని కోరారు. అలాగే.. రాష్ట్ర మహాసభల నిర్వహణ కార్యక్రమాల కోసం అడహక్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది.

Next Story