- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రో మొదటి దశపై సందేహాలెన్నో..?
హైదరాబాద్ మెట్రో-1 లోపాలపై పౌరసంఘాల ధ్వజం.. వ్యయం రూ. 14 వేల కోట్ల నుండి రూ. 30 వేల కోట్లకు చేరిక.. అంచనా 15 లక్షలు, ప్రయాణిస్తోంది 6 లక్షలే!

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు అంచనాలు తారుమారయ్యాయి. ప్రాజెక్టు రూపకల్పన, వ్యయం అంచనాల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయి. మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి భూముల కేటాయింపులోనూ అప్పటి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని విమర్శలు లేకపోలేదు. ఫలితంగా మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో సమస్యలు వచ్చాయని పలువురు పౌరసంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెండు కన్సల్టెన్సీలు ఇచ్చిన రిపోర్టు కాదని కేంద్ర ప్రభుత్వం మరో కన్సల్టెంట్‌ను నియమించడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఫలితంగా రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పైన మొదటి దశ తప్పిదాలు ప్రభావం చూపుతున్నాయని పౌర సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
రూ.14,132 కోట్ల నుంచి రూ.30వేల కోట్లకు
మొదటి దశ ప్రాజెక్టు అంచనా వ్యయంలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు చేపట్టేముందు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా చూపించారు. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎల్ అండ్ టీ సంస్థ విఫలమైంది. 2012లో అసలు వ్యయ అంచనా రూ.14,132 కోట్లు.. కానీ వాస్తవ వ్యయం రూ.30 వేల కోట్లకు చేరిందనే ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు 269 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థకు 35 ఏండ్ల పాటు ఉచితంగా బదిలీ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వానికి నయాపైసా ఆదాయం లేదు. ‘రూ.16,000 కోట్లకుపైగా అదనపు వ్యయాన్ని ఎవరు ఆమోదించారు? దీని మీద ఇప్పుడు కాగ్ ఆడిట్‌కు ఆదేశిస్తారా? ప్రభుత్వ భూమిని వాణిజ్యపరమైన వినియోగానికి మార్చడం ద్వారా ఎంత ఆదాయం సమకూరింది? అది ఎక్కడికి పోయింది?’ అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏది?
మెట్రో రైలు ప్రాజెక్టులో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు అధికారులు పలుమార్లు వెల్లడించారు. ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించారు. కానీ ఎక్కడా అమలు కాలేదు. 9 ఏండ్ల తర్వాత మొదటి, చివరి అంచె అనుసంధానం, ఫీడర్ బస్సులు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్స్ వంటి వాటిని ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. బస్సు ప్రత్యామ్నాయాల ఖర్చు కంటే మెట్రో ఛార్జీలు 2-3 రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. పైగా రోజువారీ కూలీలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు ఎలాంటి రాయితీలు లేవు. ‘మొదటి దశలో నిర్దేశించుకున్న ప్రయాణికుల లక్ష్యంలో 40 శాతాన్ని చేరుకోలేకపోతే, రెండో దశ కోసం రూ.38,595 కోట్లను ఏ ప్రాతిపదికన కోరుతున్నారు? రెండో దశ అత్యంత అవసరమైన వర్గాలకు ప్రజా రవాణా సేవలు అందిస్తుందా? లేక ప్రధానంగా ఐటీ కారిడార్లకు, రియల్ ఎస్టేట్ వృద్ధి ప్రాంతాలకు మాత్రమేనా? కేంద్ర ఆమోదానికి ముందు డిమాండ్ అధ్యయనం చేశారా? ఆర్థిక సాధ్యాసాధ్యాల అంచనాను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారా? టీజీ ఆర్టీసీ పునరుద్ధరణ, ఎంఎంటీఎస్, లాస్ట్-మైల్ పరిష్కారాలతో పోలిస్తే, అరకొరగా ఉన్న ప్రజా వనరుల నుంచి రూ.38,595 కోట్లతో పెట్టుబడి ఉత్తమ వినియోగమా?’ అని పౌర సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 15 లక్షల ప్రయాణికులేరి?
రోజుకు 15 లక్షల మంది ప్రయాణిస్తారనే అంచనాతో హైదరాబాద్ మెట్రోను ప్రారంభించారు. రోజుకు 15 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని 2017 లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా నమోదైన గరిష్ఠ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4-6 లక్షల మంది మాత్రమే. కరోనా తర్వాత ఈ ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టుగా అధికారులు చెబుతున్నారు. ‘రోజుకు 15 లక్షల మంది ప్రయాణికుల అంచనా ఎక్కడ నుంచి వచ్చింది? స్వతంత్ర సంస్థ ద్వారా ఏమైనా అధ్యయనం చేశారా? ఉంటే దానిని ఎందుకు బహిరంగ పరచలేదు?’ అని పలువురు పౌర సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.






