- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MandaKrishna Madiga : తక్షణమే పరీక్షల ఫలితాల విడుదల ఆపండి : మందకృష్ణ మాదిగ డిమాండ్
తెలంగాణలో నేటి నుంచి వివిధ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేటి నుంచి వివిధ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. రేపు గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంక్ కార్డులను విడుదల చేయనుంది. అయితే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(MandaKrishna Madiga) డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సోమవారం జరిగిన రిలే నిరాహార దీక్షలకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం (Rationalization of Reservation Act 2000) రూపొందించారని తెలిపారు. ఆ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4వ నిబంధనను పొందుపరిచారని చెప్పారు. ఆ చట్టాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. గతంలో ఇచ్చిన నోటిషికేషన్‌లో వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చూపెట్టిన నిజాయితీని రేవంత్‌రెడ్డి చూపెడితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. వర్గీకరణ వ్యతిరేక తీర్పును వేగంగా అమలు చేశారని, వర్గీకరణ అమలు తీర్పును అమలు చేయడానికి కొర్రీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని గుర్తుచేశారు.
ఓ వైపు ఎస్సీ వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే.. మరోవైపు చట్టం రాకముందే ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని అన్నారు. గ్రూప్ 1, 2, 3, హాస్టల్ వార్డెన్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ తదితర అన్ని ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీక్షలు కొనసాగుతున్నాయని తర్వాత శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని అన్నారు. తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముట్టడిలు చేపడతామని ఆయన తెలిపారు.






