- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దేవుడినే శాసిస్తామనే అహంకారం మీది’.. బ్రాహ్మణులపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సామాజిక వర్గంపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సామాజిక వర్గంపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుల వ్యవస్థకు, సామాజిక అసమానతలకు బ్రాహ్మణులే మూలకారణమని ఆయన ఆరోపించారు. "భారతదేశంలో కుల వ్యవస్థను సృష్టించి, మనుషుల మధ్య గోడలు కట్టింది బ్రాహ్మణులే. రాజుల కాలం నుండి, బ్రిటీషర్ల పాలన వరకు అన్ని కాలాల్లోనూ వారిదే ఆధిపత్యం నడిచింది" అని మందకృష్ణ మండిపడ్డారు. కేవలం బ్రాహ్మణుల ఆధిపత్యం కారణంగానే నాడు అణగారిన వర్గాలకు, బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
అందరూ బాధితులే..
కేవలం ఎస్సీలు మాత్రమే కాదు, మిగతా అన్ని వర్ణాల వారు కూడా బ్రాహ్మణ ఆధిపత్యానికి బాధితులేనని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలను తక్కువ చేసి చూడటం వారి నైజమని విమర్శించారు. "మంత్రాలతో దేవుడినే శాసిస్తాం అనేంత అహంకారం బ్రాహ్మణులది. దేవుడినే శాసించే శక్తి తమకు ఉందని భావించే వారికి.. సామాన్య ఎస్సీలు లేదా ఇతర కులాల వారు అంటే లోకువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు" అని ధ్వజమెత్తారు. అందుకే బ్రాహ్మణులు సృష్టించిన ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఈ ఆధిపత్య భావజాలాన్ని అంతం చేయాలని ఉద్ఘాటించారు. మందకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. దేశంలో కుల వ్యవస్థతో పాటు రిజర్వేషన్లూ రద్దు చేయాలని బ్రహ్మణ సంఘం నేత ద్రోణంరాజు రవికుమార్ డిమాండ్ చేశారు. అలా చేస్తామంటే మందకృష్ణ మాటలకు తప్పకుండా హర్షిస్తామని పేర్కొన్నారు. నిజాయితీకి, నిబద్ధతకు బ్రాహ్మణులు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు.






