- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోరుగా మేనేజ్‌మెంట్ సీట్ల దందా.. ఇంజినీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం!
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారితోనే మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేస్తున్నాయి. త్వరలోనే బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఈ దందా జోరందుకుంది. రాష్ట్రంలో 157 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో దాదాపుగా లక్ష వరకు సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో ఒక్కో సీటుకు కాలేజీని బట్టి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హన్మకొండలోని ఒక కాలేజీలో సీఎస్ఈ గ్రూప్ మేనేజ్‌మెంట్ కోటా సీటుకు రూ.16 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులు చేస్తే బాగుంటుందని భావించిన యువత ఎక్కువగా సీఎస్ఈ గ్రూపు వైపు మొగ్గు చూపుతున్నారు. జేఆర్ఈ, ఐఈఎల్‌టీఎస్ రాసి విదేశాల్లో ఎంఎస్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న వారు తమకు నచ్చిన కోర్సు, కాలేజీలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అదనుగా భావించిన ప్రయివేటు టాప్ కాలేజీలు ఇష్టారాజ్యంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల రేట్లను పెంచుతున్నాయి.
కంప్యూటర్ ఆధారిత కోర్సులకు డిమాండ్..
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ బ్రాంచులకు రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలేజీ లైతే ముందుగానే అడ్వాన్స్ కింద కొంత అమౌంట్‌ను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని టాప్ కాలేజీలు కన్సల్టెన్సీల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ దందాకు చెక్ పెట్టాలని స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్ నుంచి వినతులు పెద్దఎత్తున వస్తున్నాయి. బీ-కేటగిరీ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కన్వీనర్ కోటా ఫీజులకు 3 రెట్లు పెంచేలా ఓ నివేదికను రూపొందించి సర్కారుకు సమర్పించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ సీట్ల దందా మరింత రెట్టింపు అయ్యింది.
యాజమాన్యాలకు వరంగా..
ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో 70 శాతం ఎప్‌సెట్ ర్యాంకుల ద్వారా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఈ కోటాలోనే నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) కోటా ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. అయితే, ఎప్‌సెట్ ద్వారా భర్తీ చేసే సీట్లన్నీ నిబంధనల ప్రకారం విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా నింపుతున్నారు. కానీ, మేనేజ్మెంట్ కోటా(బి కేటగిరీ) సీట్లను మాత్రం కాలేజీ యాజమాన్యాలు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే కాలేజీల యాజమాన్యాలకు వరంగా మారింది. బీ-కేటగిరీ సీట్లను ఎప్‌సెట్ ర్యాంకు, జేఈఈ ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నా దాదాపు ఏ కాలేజీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.






