- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపదలో చాలా అక్కరొస్తయ్.. అలసత్వం వద్దు
రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్స్ కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగూడ, ఉప్పల్ డిపోలకు చెందిన డ్రైవర్స్ వెంకటేశ్, డీ.ఆర్.గౌడ్‌లు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉచిత ప్రమాద బీమా పథకం
ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కరకొచ్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ.కోటి అందజేస్తోంది.
రూ. కోటి విలువైన చెక్కు అందజేత
ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ.డి శ్రీ అమ్రేష్ ప్రసాద్, వారి సిబ్బందితో కలిసి సంస్థ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి శనివారం బస్ భవన్‌లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ పుష్పకుమారి, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్ర బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.భాస్కర్, ఆర్.సత్యనారాయణ, ఇతర అధికారులు గోపాలకృష్ణ, రజనీష్ కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు.
అలసత్వం వహించకూడదు
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. వేరు వేరు సమయాలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో కుషాయిగూడ డిపో, ఉప్పల్ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. తమ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తుచేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బాధితుల వివరాలు:
డ్రైవర్ ఏ. వెంకటేష్ తన ఇంటి నుండి విధుల కోసం కుషాయిగూడ డిపోకు ఉదయం ద్విచక్ర వాహనంపై వస్తుండగా కీసర సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఉప్పల్ డిపోకు చెందిన మరో డ్రైవర్ డీఆర్ గౌడ్ తన ముగ్గురు కుటుంబ స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుండి గానుగాపూర్ (కర్ణాటక)కు దైవ దర్శనం కోసం మారుతి కారులో వెళ్తుండగా తెల్లవారుజామున బొలెరో వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఆర్ గౌడ్ మరియు ఇతర ముగ్గురు కుటుంబ స్నేహితులు అక్కడికక్కడే మరణించారు.






