మైనర్​బాలికను వేధించిన యువకునికి జైలు శిక్ష

by Disha Web Desk 12 |
మైనర్​బాలికను వేధించిన యువకునికి జైలు శిక్ష
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: మైనర్​ బాలిక పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన యువకుడికి ఎల్బీనగర్​9వ అదనపు జడ్జి, స్పెషల్​పోస్కో కోర్టు జడ్జి హరీష అయిదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, పదకొండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. చైతన్యపురి పోలీస్​స్టేషన్​పరిధిలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ ఇంట్లోని కూలర్​ చెడిపోవడంతో రిపేర్ చేయించటానికి బ్లూ స్టార్ డీలర్‌కు ఫోన్​చేశారు. ఈ క్రమంలో డీలర్​ తన వద్ద పనిచేస్తున్న ఆస్మాన్​ఘడ్ ​నివాసి మహ్మద్​ ఆరీఫ్​ను పంపించాడు. కూలర్​ రిపేరు చేసిన అనంతరం మహమ్మద్ ​ఆరిఫ్​ కుటుంబ సభ్యుల నుంచి వారి మొబైల్​ నెంబర్ తీసుకున్నాడు.

ఆ తరువాత కుటుంబంలోని పద్నాలుగేళ్ల బాలికకు ఫోన్లు చేస్తూ, మెస్సేజీలు పెడుతూ తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. 2017, జూలై 4న ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడ్డ మహమ్మద్ ​ఆరిఫ్ ​బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టగా వెళ్లిపోతూ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ నాన్నను చంపేస్తానని బెదిరించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందటంతో చైతన్యపురి పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ జరిపి కోర్టుకు సాక్ష్యాలను అందచేశారు. కేసును విచారించిన జడ్జి మహమ్మద్​ ఆరిఫ్​కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష, పదకొండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఎస్ఐ జీ.ఎరోజీ కేసు దర్యాప్తు చేయగా అదనపు పబ్లిక్​ప్రాసిక్యూటర్లు కే.వీ.బీనా, బీ.సునీతలు వాదనలు వినిపించారు.



Next Story