బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య..తప్పుడు ప్రచారంపై పోలీసుల వార్నింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-14 07:35:26  IST  )

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనే వ్య‌క్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య..తప్పుడు ప్రచారంపై పోలీసుల వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో వంట చేసే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి (30) అతని భార్య గంధమల్ల నవితలు యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల ఐలయ్య ఇంట్లో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. రవి మూడు సంవత్సరాల క్రితం ప్రైవేట్ బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. కానీ కిస్తీలు సరిగా కట్టపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి తాళం వేస్తారని భయం వేసి, 15 రోజుల నుంచి బాగా మద్యం సేవిస్తున్నాడు. సైదాపురం ఊరిలో కూడా అప్పుల సమస్యలు ఎక్కువయ్యాయి.

గత రెండు రోజుల క్రితం సైదాపురంలోని అతని ఇంటికి బ్యాంకు అధికారులు వచ్చి లోనుకు సంబంధించిన డబ్బులు సరిగా కట్టడం లేదని బ్యాంకు వారు నోటీస్ కూడా అతికించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఇంట్లోని నాలుగవ ఫ్లోర్ లో ఉన్న రేకుల షెడ్డుకి శాలువాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో కిందికి దించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు‌. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలంను కూడా నమోదు చేసినట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు...

ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ విషయమై ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా గానీ, మరి ఏ విధంగానైనా ప్ర‌చారం చేస్తే ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story