- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన బలాన్ని అతిగా అంచనా వేసుకున్నాం.. మావోయిస్టు పార్టీపై మల్లోజుల సెన్సేషనల్ కామెంట్స్
మావోయిస్టు పార్టీలో సంచలనం చోటు చేసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి మల్లోజుల వేణుగోపాల్ వైదొలిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ (Maoist ceasefire) ప్రకటించాలనే విషయంలో మావోయిస్టు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పేరుతో క్యాడర్‍కు రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చూశామని, ఉద్యమం ఓటమిపాలు కాకుండా కాపాడలేకపోయామని ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణ విషయంలో తన అభిప్రాయాన్ని విభేదిస్తున్న పార్టీ అధికార ప్రతినిధి జగన్‍కు మల్లోజుల పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాల్పుల విరమణపై అభయ్ పేరుతో మల్లోజుల ఇటీవల లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆయన రాసిన లేఖలో ఆరు పేజీలు మాత్రమే బయటకు రాగా ఇప్పుడు మొత్తం 22 పేజీలతో కూడిన లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖ పాతదే అయినా తాజాగా వైరల్ అవుతోంది. ఈ లేఖపై మావోయిస్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
అనవసర త్యాగాలు వద్దు:
పార్టీని కాపాడుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల వల్లే ఇప్పుడు నేను కాని, అంతకు ముందు జీ.ఎస్ కానీ ఈ శాంతి చర్చల ప్రక్రియకు పూనుకున్నామని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని క్యాడర్ కు మల్లోజుల సూచించారు. పార్టీ వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకు కగార్‍ను ఒక సందర్భంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతోంది. అందుకు దారి తీసిన కారణాలను నేను మీ ముందు ఉంచుతున్నానని అన్నారు. వీటిపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. శత్రువుకు అభేద్యమైన రహస్య విప్లవ పార్టీ నిర్మాణం లేకపోవడం వల్లే ఈరోజు శత్రు వర్గాలు ముహుర్తాలు ప్రకటించి మన పార్టీని అంతం చేస్తామంటున్నారని వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది మనం అనుసరించిన తప్పుడు విధానాలేనన్నారు. అర్బన్ పాలసీ పేపర్ రాసుకున్నప్పటికీ దానిని అమలు చేయలేని పరిస్థితి మనదని లేఖలో రాశారు. తప్పులను సవరించుకోవాలని కింది స్థాయి నుంచి అభిప్రాయాలు వస్తున్నా వాటిని పార్టీ కేంద్ర కమిటీ (సీసీ) లెక్క చేయడం లేదని విమర్శించారు. దండకారణ్యంలో ఏడాదికి ఒకటి రెండు పెద్ద సైనిక చర్యలు చేస్తూ మన బలాన్ని అతిగా అంచనా వేసుకున్నామే తప్ప మన బలహీనతలను అర్థం చేసుకోకపోయామన్నారు.
ఇప్పుడు అనుభవిస్తున్నాం:
లోటుపాట్లు ఎవరు చెబితే వారినే ప్రజా యుద్ధం అర్థం కాని వారిగా సెంట్రల్ కమిటీ ఎద్దేవా చేస్తూ వస్తోందని, వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ చివరకు ఓటమి పాలవుతున్నామని మల్లోజుల అన్నారు. ఇంత జరిగినా సీసీ ఇంకా సీరియస్‍గా గుర్తించడమే లేదని ఇకనైనా అతివాద ఒంటెద్దు పోకడలు వదిలి ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలను అధ్యయనం చేయాలని సూచించారు. చట్టబద్ధ పోరాటాలను కాలదన్నుకున్నామని, తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం టీకా వంటిదన్నారు. పార్టీ క్యాడర్‍ను కాపాడుకోవాలి. అనవర త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. వర్తమాన ఫాసిస్టు విధానాలతో లక్ష్యం నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‍కు మల్లోజుల పిలుపునిచ్చారు.






