మల్లారెడ్డి వేల ఎకరాలు కబ్జా పెట్టిండు.. కవిత సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

పాలు అమ్మి, పూలు అమ్మిన డైలాగులు కొడుతూ.. మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాలు కబ్జా పెట్టారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు.

మల్లారెడ్డి వేల ఎకరాలు కబ్జా పెట్టిండు.. కవిత సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాలు అమ్మి, పూలు అమ్మిన డైలాగులు కొడుతూ.. మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో వేల ఎకరాలు కబ్జా పెట్టారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు (Jawahar Nagar Dumping Yard)ను పరిశీలించారు. అనంతరం అంబేడ్కర్‌నగర్‌లో బస్తీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. మల్లారెడ్డి వల్ల నిరుపేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని.. అంతా పైపై మెరుగులు దిద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు.

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత తీరిందని, కానీ కాంగ్రెస్ వచ్చాక మళ్లీ ఆ సమస్య మరింత పెద్దదైందని కవిత అన్నారు. జీవో నెంబర్ 58, 59లో భాగంగా భూముల క్రమబద్ధీకరణ పేరుతో పేదలతో డబ్బులు కట్టించుకున్నా.. నేటికీ రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆక్షేపించారు. మాజీ మేయర్, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు మాత్రం ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయో చెప్పాలన్నారు. ఈ విషయంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. లేబర్ మినిస్టర్‌గా ఉన్న మల్లారెడ్డి మానవ హక్కుల గురించి ఆలోచించలేదని.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో ఉన్న వారి పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. మల్లారెడ్డి కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రమే బాగుపడ్డాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

Next Story