- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాధవరెడ్డికి టికెట్‍పై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి.. అసలు బీఆర్ఎస్‍లో ఏం జరుగుతోంది?
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యర్థుల ఎత్తుగడలకు దెబ్బయి పోవడం ఖాయం. రాజకీయ దురంధరులు అనుకున్న ఎందరో తాము చేసిన చిన్న పొరపాట్లకు భారీ మూల్యమే చెల్లించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది తాజాగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకువచ్చేలా కనిపిస్తోంది. పరిస్థితులు అంతా తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఈ ఒక్క నిర్ణయం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డికి (Madhava Reddy) గులాబీ పార్టీ టికెట్ ఇవ్వడం రాజకీయంగా దుమారం రేపుతోంది. మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ పదో వార్డు కౌన్సిలర్ స్థానానికి మాధవరెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. దీంతో ఒక్క టికెట్ పార్టీకి తేరుకోని డ్యామేజ్ చేయబోతోందా? ఇప్పుడిదే చర్చ గులాబీ పార్టీలో గుప్పుమంటోంది.
ప్రత్యర్థులకు ఆయుధంగా..:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ పాలిటిక్స్ అంతా బీసీ రిజర్వేషన్ల (BC Reservations) చుట్టూ తిరుగుతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు రేవంత్‍రెడ్డి సర్కార్‍ను కార్నర్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‍రెడ్డికి చిత్తశుద్ధి లేదని పదే పదే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఆ పార్టీ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. బీఆర్ఎస్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తల మీద పాలుపోసినట్లుగా మారిందని బీసీ రిజర్వేషన్ల విషయంలో పరిస్థితులను ఇంత కాలం డిఫెన్స్ చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఇకపై ఈ నేరమంతా బీఆర్ఎస్‍పై మోపేందుకు గులాబీ పార్టీనే వజ్రాయుధం ఇచ్చినట్లైందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే కవిత, బీసీ సంఘాలు బీఆర్ఎస్‍ను కార్నర్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధిష్టానం మాత్రం మౌనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాధవరెడ్డికి టికెట్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్‍ను ఏ రకంగా డిసైడ్ చేయబోతోందో అనేది ఉత్కంఠగా మారింది.
ఇప్పుడు ఓడించమంటే ఎలా?:
అయితే మాధవరెడ్డికి టికెట్ విషయంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న వేళ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. మాధవరెడ్డికి టికెట్ అనేది తెలియకుండా ఇచ్చానని, అతడు బీసీలకు వ్యతిరేకంగా కేసు వేసిన విషయం నాకు తెలియదని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన మల్లారెడ్డి.. నేను బీసీలకు వ్యతిరేకం కాదన్నారు. తొలుత ఆ గ్రామంలో ఉన్న మా మాజీ సర్పంచ్‍ను పోటీ చేయమని చెప్పాను. కానీ అతడు మాధవరెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పాడని దాంతో మాధవరెడ్డికి ఇచ్చామన్నారు. ఈ టికెట్ మా సర్పంచ్ ఇప్పించాడని చెప్పారు. అతడు బీసీలకు వ్యతిరేకంగా పని చేసిన విషయం తెలియకుండా టికెట్ ఇచ్చామని అతడిని ఎన్నికల్లో ఓడించాలని కోరారు.
పార్టీలో ఏం జరుగుతోంది?:
ఈ విషయంలో మల్లారెడ్డి ఇచ్చిన వివరణ కొత్త చర్చకు దారి తీస్తోంది. నిజానికి రాజకీయ పార్టీలకు ఎన్నికలు ఎంత ముఖ్యంమో ఆ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల ఎంపిక అంతకంటే ముఖ్యం. అందుకే క్యాండిడేట్ల సెలక్షన్ విషయంలో పార్టీలన్ని ఎన్నికలకు నెలల ముందే కసరత్తు చేస్తుంటాయి. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థిని రంగంలోకి దింపుతాయి. ఇక తమను కార్నర్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకం అనే విషయం బీఆర్ఎస్‍కు తెలియనిది కాదు. అలాంటిది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బీసీల రిజర్వేషన్ల అంశంలో కీలక వ్యక్తిగా ఉన్న మాధవరెడ్డికి ఏదో యథాలాపంగా టికెట్ ఇచ్చామని అతడు నచ్చకపోతే ఇప్పుడు ఓడించాలని మల్లారెడ్డి కోరడంతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అన్ని విషయాలను ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించే కేసీఆర్ అధినేతగా ఉన్న గులాబీ పార్టీలో ఇదేం తతంగం అనే చర్చ తెరపైకి వస్తోంది. మాధవరెడ్డి అభ్యర్థిత్వం కారుపార్టీకి కలిసి వస్తుందా బెడిసి కొడుతుందా అనేది ఈ నెల 13న తేలనుంది.






