TG: పది కూడా పాస్ కాలేదు.. కానీ 20 ఏళ్లుగా 'డాక్టర్'

by Gantepaka Srikanth |

చదివింది పదో తరగతి కూడా పూర్తి చేయలేదు.. కానీ ఏకంగా ఇరవై ఏళ్లుగా డెంటిస్ట్‌గా అవతారమెత్తి రోగుల పళ్లతో ఆడుకుంటున్నాడు ఒక వ్యక్తి.

TG: పది కూడా పాస్ కాలేదు.. కానీ 20 ఏళ్లుగా డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: చదివింది పదో తరగతి కూడా పూర్తి చేయలేదు.. కానీ ఏకంగా ఇరవై ఏళ్లుగా డెంటిస్ట్‌గా అవతారమెత్తి రోగుల పళ్లతో ఆడుకుంటున్నాడు ఒక వ్యక్తి. నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్న ఈ నకిలీ డాక్టర్ గుట్టును రాచకొండ ఎస్ఓటీ (SOT) మరియు మల్కాజ్‌గిరి పోలీసులు కలిసి రట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కనీసం పదో తరగతి కూడా పాస్ కాని రమేష్, నేరేడ్‌మెట్ పరిధిలో ఒక డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి దర్జాగా డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఎటువంటి అర్హత లేకపోయినా, గత 20 ఏళ్లుగా స్థానికులకు డెంటల్ సర్వీసులు అందిస్తూ వస్తున్నాడు.

రాత్రిపూట మాత్రమే వైద్యం.. ఎందుకంటే?

రమేష్ అనుసరిస్తున్న చికిత్సా విధానం చాలా వింతగా ఉండేది. అతను కేవలం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే క్లినిక్ నడిపేవాడు. పగటిపూట ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే అతను ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, అతని చికిత్సా విధానంపై, క్లినిక్ నిర్వహణపై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు సదరు క్లినిక్‌పై సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రమేష్ దగ్గర ఎటువంటి మెడికల్ డిగ్రీ కానీ, కనీసం పదో తరగతి పాస్ అయిన సర్టిఫికెట్ కానీ లేవని తేలింది. దీంతో పోలీసులు విస్తుపోయారు. అర్హత లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రమేష్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story