- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్‌లో చోటు కల్పించండి.. నటరాజన్‌ను కలిసిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ.. రోజురోజుకు ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ.. రోజురోజుకు ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది. ఎమ్మెల్యేలే కాకుండా.. ఇప్పుడు శాసనమండలి సభ్యులు కూడా మినిస్టర్ పోస్టు కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ లు చేరారు. ఆదివారం వీరు వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ను కలిశారు. పార్టీ, ప్రభుత్వ పథకాలన్నింటిపై తమ అభిప్రాయాలను చెప్పారు. తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం మీనాక్షి నటరాజన్ ను కలిశారు. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల ప్రతిపాదికన మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పినట్లు తెలిసింది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు 17 మందిని అకామిడెట్ చేయవచ్చని సూచించినట్లు సమాచారం.
‘భువనగిరి’ నుంచి తీవ్ర పోటీ
మంత్రి పదవి కోసం భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్య, మందుల సామేల్, వేముల వీరేశం ఉన్నారు. ఎవరికి వారు తమకున్న ప్రత్యేకతలను చెప్పుకుంటూ మినిస్టర్ పోస్టు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో వ్యక్తిగతంగా, సామాజిక వర్గాల పరంగా, జిల్లాల కోణంలో ఎవరికి వారు తమకు మంత్రి పదవి ఇవ్వాలని విన్నవిస్తున్నారు. తమకున్న అనుకూల విషయాలను పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలకు చెబుతున్నారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మిగతా జిల్లాల్లోనూ..
ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు నలుగురు శాసనసభ్యులు ఉంటే.. అందులో ముగ్గురు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వెడ్మ బొజ్జు, వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఈ ముగ్గురు కూడా మూడు సామాజిక వర్గాల వారు కావడంతో ఎవరిని ఎంపిక చేయాలో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిజామాబాద్ నుంచి పార్టీ గుర్తుపై ముగ్గురు గెలుపొందారు. సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతరావు ముగ్గురు కూడా మంత్రి కావాలని ఆశపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో బీసీ ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరి, రాష్ట్రంలో పెద్ద సామాజికవర్గంగా ఉన్న మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
సామాజికవర్గాల వారీగా మరో మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరుగురం మాదిగ శాసనసభ్యులం ఉన్నాం.. ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ నాయకులందరినీ కలుస్తున్నారు. లంబాడ సామాజికవర్గం నుంచి సైతం ఇదే రకమైన డిమాండ్ వస్తున్నది. తమ లంబాడ సామాజికవర్గం నుంచి ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరిగి ఉంటే.. ఇప్పుడు పోటీ పడే వారిలో కొందరికి కొత్తగా ఆశలు పుట్టేవి కావని, ఆలస్యమవుతున్న కొద్దీ ఆశ పెరుగుతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఆలస్యమైతే పోటీదారులు మరింత పెరిగే అవకాశముందని పేర్కొంటున్నాయి. మంత్రివర్గాన్ని ఇప్పటికైనా విస్తరించి.. ఆశావహుల జాబితాను ఇక్కడితో ఆపాలని కోరుతున్నాయి.






