- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ రైలు మార్గానికి భారీ అప్‌గ్రేడ్.. రూ.285 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను మరింత మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఒక భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను మరింత మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఒక భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 1x25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను ఆధునిక 2x25 కేవీ ట్రాక్షన్ వ్యవస్థగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. సుమారు 141 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే సెక్షన్‌లో రూ.285.01 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రైలు కారిడార్లలో సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ నిరంతరం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. కొత్తగా ప్రవేశపెట్టే 2x25 కేవీ వ్యవస్థ ద్వారా రైళ్ల నిర్వహణకు మరింత స్థిరమైన, సమర్థవంతమైన విద్యుత్ సరఫరా అందుతుంది. దీనివల్ల రైలు సర్వీసులు మరింత సాఫీగా, సురక్షితంగా, నమ్మదగినవిగా మారుతాయి. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్ దేశంలోని అత్యంత కీలకమైన హై-డెన్సిటీ నెట్‌వర్క్ (హెచ్డీఎన్) మార్గాలలో ఒకటిగా ఉంది. ఇది ధర్మవరం-డోన్-మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్-ముద్ఖేడ్-ఇండోర్-అజ్మీర్ రైల్ కారిడార్ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలో నిత్యం భారీ సంఖ్యలో ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లు నడుస్తుంటాయి.
ప్రాజెక్టుతో చేకూరే ప్రయోజనాలు..
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా సరుకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా సాగుతుంది. సరుకు రవాణా సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. వేగవంతమైన రవాణా సౌకర్యం ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు పుంజుకోవడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలనే రైల్వే శాఖ సంకల్పానికి ఈ చొరవ మరింత బలాన్ని ఇస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యం ద్వారా అటు ప్రయాణికులకు, ఇటు పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.






