తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన: కొత్త నియామకాలపై అధిష్టానం ఫోకస్!

by Naga Rani Yarlagadda |

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్నది.

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన: కొత్త నియామకాలపై అధిష్టానం ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్నది. తమిళనాడులో రాజకీయాలు కొలిక్కి రాగానే.. ఒకటీ, రెండు రోజుల్లో కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపైనే మొత్తం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో త్వరలో పలు కీలక మార్పులు జరగొచ్చనే చర్చ జరుగుతున్నది. మంత్రివర్గ ప్రక్షాళన, పలువురు మంత్రుల శాఖల తొలగింపు, అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతున్నది.

త్వరలో ఢిల్లీలో కీలక మీటింగ్..

త్వరలో ప్రభుత్వం, పార్టీని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన కీలక నేతలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి పార్టీ, ప్రభుత్వంలో జరిగే మార్పులపై అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా పలు నివేదికల ఆధారంగా పనితీరు సరిగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తొలగించి, ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నది. దీంతో ఎవరిని తొలగించాలి? ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి? అనే అంశంపై నేతల ఒపీనియన్ తీసుకుని, అధిష్టానం ఆలోచన ఏమిటో కూడా వివరించే అవకాశం ఉంది. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సూచనలు చేయొచ్చని తెలుస్తున్నది.

మంత్రి పదవికి బదులుగా పార్టీ పదవులు

మంత్రివర్గం నుంచి తొలగించిన ఎమ్మెల్యేలను ఖాళీగా ఉంచితే, సదరు నేతలను అవమానపరిచారంటూ ఆయా సామాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అవినీతికి పాల్పడ్డారనే కారణంతోనే మంత్రివర్గం నుంచి పక్కన పెట్టారనే విమర్శలు విపక్షాల నుంచి రావడం ఖాయం. అందుకని మంత్రివర్గం నుంచి తప్పించి, పార్టీ పరంగా కీలక పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు టాక్. అందులో భాగంగా కొందరికి ఏఐసీసీ, పీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

శాఖల మార్పు తథ్యం

ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద రెండేసి కీలక శాఖలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా మంత్రులు ఆ రెండు శాఖలను పర్యవేక్షిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. అయితే, కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదని, మరికొందరు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో సంబంధిత మంత్రుల నుంచి ఆయా శాఖలను తొలగించి, ఇతర శాఖలను కేటాయించడమో, లేకపోతే ఒక శాఖకే పరిమితం చేయడమో జరుగుతుందని తెలిసింది.

పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటుకు కసరత్తు

త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసి, అందరికి గెలుపు బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఒకేసారి భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నాలుగు పదవులకు కేబినెట్ హోదా ఉంటుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలను సమన్యాయం చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం, పార్టీ మధ్య గ్యాప్

ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తయింది. కానీ, ఇప్పటికి కూడా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వడంలో నేతలు ఆసక్తి చూపడం లేదని టాక్. ఈ జాబితాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పైరవీల కోసం కేటాయించే సమయంలో పదో వంతు టైమ్ పార్టీ కేడర్‌ను కలిసేందుకు కూడా కేటాయించడం లేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరినట్లు ప్రచారం ఉంది. దీంతో పార్టీ, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గ్యాప్‌ను పూరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే అవకాశం ఉంది.

వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం

చాలా కాలంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం వాయిదా పడుతున్నది. దీంతో పార్టీ యాక్టివిటీస్ స్పీడప్ కావడం లేదనే వాదనలు ఉన్నాయి. అందుకని నలుగురు లీడర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి/రోహిణ్ రెడ్డిల్లో ఒకరికి, ఒక మహిళా నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.

Next Story