ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు.. అకౌంటెన్సీకి పెద్దపీట

by Naga Rani Yarlagadda |

ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించాలనే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ సిలబస్‌లో భారీ మార్పులు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు.. అకౌంటెన్సీకి పెద్దపీట
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించాలనే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ సిలబస్‌లో భారీ మార్పులు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ సలహాదారు కేశవరావు సైతం మానవ, నైతిక విలువలు పెంచేలా కొత్త సిలబస్ ఉండేలా సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అకౌంటెన్సీ విభాగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కొత్తగా అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ కలయికతో కూడిన ప్రత్యేక గ్రూపునకు ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. భవిష్యత్తులో సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్లే విద్యార్థులకు ఇది ఒక వరంగా మారనుంది.

ఒత్తిడి తగ్గించే దిశగా..

ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీసీ, బైపీసీ, గ్రూపుల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి ప్రధాన సైన్స్ సబ్జెక్టుల్లో దాదాపు 20 శాతం సిలబస్‌ను తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పోటీ పరీక్షల దృష్ట్యా కేవలం ముఖ్యమైన అంశాలకే ప్రాధాన్యతనిస్తూ, పునరావృతమయ్యే పాఠాలను తొలగించనున్నారు. ఫస్టియర్, సెకండియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలోని కొన్ని పాఠ్యాంశాలను మార్చే అవకాశం ఉంది. సాధారణంగా ఫస్టియర్‌లో మ్యాథ్స్-ఏ సులభం అని, మ్యాథ్స్-బీ కష్టమని, అలాగే సెకండియర్‌లో మ్యాథ్స్-ఏ కష్టమని, మ్యాథ్స్-బీ సులువని మెజారిటీ విద్యార్థులు భావిస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టేలా 2026-27 విద్యా సంవత్సరానికి 75 మార్కులు ఉండే మ్యాథ్స్ పేపర్‌కు ఇంటర్నల్ మార్కులను చేర్చాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల జూన్‌లో ప్రారంభం కానున్న అకడమిక్ ఇయర్‌లో ఫస్టియర్ వాళ్లకు 60 మార్కులకే పరీక్ష ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీబీఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

Next Story