హైదరాబాద్‌లో ఆ మూడు గంటల్లోనే భారీగా రోడ్డు ప్రమాదాలు

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలు, ఐటీ కారిడార్‌లలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఆ మూడు గంటల్లోనే భారీగా రోడ్డు ప్రమాదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలతో విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. క్షణికావేశం, అతివేగం, మద్యం మత్తు వంటి కారణాలతో రోడ్లపై నిత్యం ప్రాణనష్టం చోటుచేసుకుంటుంది. గమ్యానికి చేరాల్సిన వారు అర్ధాంతరంగా మృత్యుఒడికి చేరుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా దెబ్బతింటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు చేసిన తాజా విశ్లేషణలో నగరవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యంత ప్రమాదకర సమయంగా (డేంజర్ టైమ్) గుర్తించారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే తొందర, అలసట, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ మూడు గంటల వ్యవధిలోనే ఎక్కువ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.

12 కిలోమీటర్ల పరిధిలో 134 మంది మృతి

నగర శివారుల గుండా వెళ్లే నేషనల్ హైవే-65 (విజయవాడ కారిడార్)లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని కేవలం 12 కిలోమీటర్ల రహదారిపైనే 961 ప్రమాదాలు నమోదయ్యాయి. గడిచిన ఎనిమిది నెలల్లో 134 మంది ప్రాణాలు కోల్పోగా, 816 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, యూ-టర్న్‌ల వద్ద గందరగోళం, రోడ్డు దాటుతున్న పాదచారులను ఢీకొట్టడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తేల్చారు. హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో నమోదయ్యే కేసుల్లో రోడ్డు ప్రమాదాలే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ఐటీ కారిడార్‌లో ఓవర్ స్పీడ్, రేసింగ్‌లు

హైవేల తర్వాత ఐటీ కారిడార్ ప్రమాదాల హాట్‌స్పాట్‌గా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి ప్రాంతాల్లో దాదాపు 800 ప్రమాదాలు చోటు చేసుకోగా, 123 మంది మృతి చెందారు. 685 మంది గాయపడ్డారు. ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ జామ్, నైట్ డ్రైవింగ్, రేసింగ్‌లు, అతివేగం ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉన్నా నియంత్రణలేని వేగం ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ ప్రాంతాల్లో భద్రత పెంచేందుకు ట్రాఫిక్ ఇంజినీరింగ్ మార్పులు చేపడుతున్నారు.

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి

ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా వాడాలి. ‘అరైజ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుతున్నాం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై మరణిస్తున్నారు. కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించకపోతే ప్రమాద సమయంలో తీవ్ర గాయాలు, మరణాలు సంభవించే అవకాశం ఉంది. సీటు బెల్ట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. -రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ డీసీపీ, హైదరాబాద్

Next Story