- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ శివార్లలో భారీ అగ్నిప్రమాదం.. పెల్లెట్స్ తయారీ పరిశ్రమలో మంటలు
హైదరాబాద్ నగర శివార్లలోని కాటేదాన్ టాటా నగర్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగర శివార్లలోని కాటేదాన్ టాటా నగర్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెల్లెట్స్ (ప్లాస్టిక్) తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ ముడి సరుకులకు మంటలు అంటుకోవడంతో అవి క్షణాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. దీంతో సమీప కాలనీల ప్రజలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంటలు చెలరేగినట్లు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలో ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉండగా, అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ, ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఆదివారం కావడంతో పరిశ్రమకు సెలవు ఉండటంతో కార్మికులు విధుల్లో లేరు. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో పరిశ్రమలోని యంత్రాలు, భారీగా నిల్వ ఉంచిన ప్లాస్టిక్ ముడి సరుకులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.






