మహిళా రిజర్వేషన్‌పై మజ్లిస్ కుట్ర? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Ramesh Naini |

రేవంత్ రెడ్డి ఇచ్చిన హైబ్రిడ్ ఫార్ములా మజ్లిస్ పార్టీ తయారు చేసిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విరుచుకపడ్డారు.

మహిళా రిజర్వేషన్‌పై మజ్లిస్ కుట్ర? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి ఇచ్చిన హైబ్రిడ్ ఫార్ములా మజ్లిస్ పార్టీ తయారు చేసిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విరుచుకపడ్డారు. అసదుద్దీన్ పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి ఫార్ములాను ప్రశంసించాడని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి మహిళలకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండొద్దనేది మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తుందని, మహిళలు రాజకీయాల్లోకి వస్తే కొత్త సమస్యలు వస్తాయని మజ్లిస్ నాయకులు, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినవి అసెంబ్లీ రికార్డులో ఉన్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో సీట్ల పునర్విభజన జరిగితే తమ సీట్లకు ఎక్కడ ముప్పువస్తుందో అనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని కలిపి కుట్రలు చేస్తోందన్నారు. మజ్లిస్ పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి చర్చించి పునర్విభజనను, మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 70 శాతం ఆదాయం వస్తుంది. మిగిలిన జిల్లాలకు కోతపెట్టి గ్రేటర్ ​జిల్లాలో సీట్లు పెంచాలని రేవంత్, అసదుద్దీన్, కేటీఆర్ కోరుతున్నారని, మిగిలిన జిల్లాల్లో సీట్లు పెరగాల్సిన అవసరం లేదో ఈ ముగ్గురు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యావంతులు, మేధావులతో చర్చలు జరిపి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సవరణ, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు.

దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం అనడం విడ్డూరం :

దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని పార్లమెంటు వేదికగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మొదట్లో జనాభా సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం దక్షిణాదిలో సీట్లు తగ్గకుండా ప్రజల సెంటిమెంటును గుర్తించి 50 శాతం పెంపు ఫార్ములా తీసుకుని వచ్చిందన్నారు. ఏ కారణంతో వ్యతిరేకించాలో తెలియకుండా గుడ్డిగా కొత్త ఫార్ములాను వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలతో సహా పురుషుల్లోనూ కొత్త నాయకత్వం వస్తుందనే భయం విపక్షాల్లో ఉంది. అదే జరిగితే తరతరాలుగా కుటుంబాల చేతుల్లో ఉన్న పార్టీల నాయకులకు వారి ప్రాబల్యం తగ్గుతుందనే భయం నెలకొంది. బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కొద్దనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్ మహిళలకు వస్తుందేమోనన్న కుట్రతో మజ్లిస్ ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది. దానికి సీఎం రేవంత్, కేటీఆర్ వంతపాడుతున్నారు. మత ఛాందసవాదంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఏకం చేస్తోందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీలో ఏ ఒక్క ముస్లిం మహిళా కార్పొరేటర్ పేరు ఎవరైనా చెప్పాలని ప్రశ్నించారు. మహిళలు వంటింటి కుందేలుగా, పిల్లలు కనే మిషన్లుగా మాత్రమే ఉండాలనేది మజ్లిస్ ఆలోచన అన్నారు. మోడీ ఫార్ములాతో దక్షిణాదికి న్యాయమా, అన్యాయమా అని బహిరంగంగా చర్చించేందుకు సవాల్ విసిరారు. వితండవాదం లేకుండా చర్చకు రావాలన్నారు. ఏపీ విభజన బిల్లులో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచాలని పేర్కొన్నారు. ఏ ఫార్ములా అనుసరించారో కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బిల్లు పాసైన తర్వాత ఇందులో అమెండ్‌మెంట్ చేయాలంటే నోటిఫై చేయాల్సిందే. 2023లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ నోటిఫై చేసింది. ఇప్పుడు మహిళా బిల్లులో సవరణలు తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదన్నారు.

Next Story