- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్కల రైతులకు చెల్లింపుల్లో జాప్యం.. వందల కోట్ల బకాయిల కోసం ఎదురుచూపులు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించిన రైతన్నలు ఇంకా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించిన రైతన్నలు ఇంకా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా యాసంగి డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదట కొనుగోలు చేసిన రైతులకు రూ.5,200 కోట్లు నగదు పంపిణీ చేయగా మరో రూ.250 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున 14.80 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది. అయితే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించిన రైతులకు వారం, పదిరోజుల్లోనే డబ్బులు చెల్లించేవారు. కానీ ఈసారి మాత్రం నెల రోజులు దాటినా డబ్బులు జమ కాలేదు. దీంతో పాత బకాయిలు చెల్లించడం, ఇంట్లో రోజువారి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులకోసం రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మరుసటి పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు సిండికేట్
మార్క్‌ఫెడ్ గత 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వేలం నిర్వహించింది. ఈ వేలంలో ప్రభుత్వానికి ఆశించిన ధర రాలేదు. వ్యాపారులు రూ.1900 వరకే వేలం పాట పాడారు. ఈ ధర గిట్టుబాటు కాలేక మరోసారి అధికారులు వేలానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మక్కల కొనుగోలు కోసం మార్క్ఫెడ్ బ్యాంకు రుణాలు తీసుకోగా ఈ రుణంపై వడ్డీలు, కేంద్రాల ఏర్పాటు, హమాలీ, రవాణా, గోదాముల అద్దెలు, నిల్వ ఖర్చులు కలిపి క్వింటాల్‌కు రూ.2900 వరకు ఖర్చు అయింది. ఈ ధరకు అమ్మితే ప్రభుత్వానికి లాభం రాకున్నా నష్టం ఉండదు. కానీ ఈ ధర రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కనీసం రూ.2500 వచ్చిన ఫర్వాలేదనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర ప్రకటించినా ఒక గింజ కొనుగోలు చేయలేదు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా కేంద్రం ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో మిగతా పంటను రేవంత్రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఖమ్మంలోనే అత్యధికం
ఈ ఏడాదిలో ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా 3 లక్షల మెట్రిక్టన్నుల మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్టన్నులు, నిర్మల్జిల్లాలో 1.73 లక్షల మెట్రిక్టన్నులు సేకరించారు. వీటిలో సగానికిపైగా మక్కలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించగా, చివరి వారంలో కొనుగోలు చేసిన వారికే ఇంకా ఇవ్వలేదు. అధికారులు మాత్రం వేలం ద్వారా వచ్చిన డబ్బులను రైతులకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు చెల్లించిన డబ్బులు కూడా రుణాలు తీసుకుని చెల్లించినవే. ఇంకా అప్పులు తేవడం కష్టమని, కొంత ఆలస్యమైనా వేలం తరువాత వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.






