- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క

దిశ, ములుగు ప్రతినిధి: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదనపు సీఈఓ సర్ఫ్‌పి కట్యాయిని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, "ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఇందిరమ్మ కలను సాకారం చేసే దిశగా మహిళా సంఘాలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తోంది," అని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ రుణాలు మహిళా సంఘాలకు అందించబడినట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ములుగు జిల్లాలో 249.07 కోట్ల విలువైన రుణాలు మంజూరయ్యాయని, రాబోయే 2025–26 సంవత్సరానికి గాను 618 సంఘాలకు 54.79 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశామని వివరించారు. అంతేకాదు, 5109 సంఘాలకు 884.53 కోట్లు, 52615 మంది సభ్యులకు 10.74 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
మహిళల అభివృద్ధి కోసం ఆర్టీసీ అద్దె బస్సులు, కుట్టు మిషన్లు, మైక్రోఎంటర్‌ప్రైజెస్, పాడి గేదెలు, పెరటి కోళ్లు, పౌల్ట్రీ మదర్ యూనిట్లు, సంచార చేపల వ్యాపార కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థాపన వంటి అనేక సేవలను మహిళా సంఘాల ద్వారా అందజేస్తున్నామని మంత్రి వివరించారు.
మహిళా సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు, సహజ మరణం జరిగితే 2 లక్షల రూపాయల వరకు బీమా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. 60 ఏళ్లు నిండినవారిని కూడా మహిళా సంఘాల్లో చేర్చాలని, 15 ఏళ్లు నిండిన ప్రతి యువతిని సంఘాల్లో భాగం చేసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాలు ఇప్పటివరకు 99 శాతం రుణాలను తిరిగి చెల్లించడంతో బ్యాంకులు స్వయంగా క్యూ కడుతున్న స్థాయికి చేరాయన్నారు. మహిళలు ప్రైవేట్ రంగాల్లోనూ, వ్యాపారాలలోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా "ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్" వంటి కార్యకలాపాలు మహిళలకు నెలకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీతో పాటు మైనార్టీ శాఖ ద్వారా నాలుగు మంది మహిళలకు కుట్టుమిషన్లను మంత్రి అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, అధికారులూ, ప్రజాప్రతినిధులూ, మహిళలూ పాల్గొన్నారు.





