- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోషులు జైలుకు వెళ్లడం ఖాయం: హైకోర్టు తీర్పుపై మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు స్వల్ప ఊరట లభించినట్లయింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నివేదిక రూపకల్పనలో కొన్ని నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు మాత్రం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని చెబుతూనే, విచారణ తీరుపై కీలక వివరణ ఇచ్చారు. హైకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కానీ, దాని విచారణను కానీ, నివేదికను కానీ తప్పుబట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే కోర్టు తప్పుబట్టిందని గుర్తు చేశారు.
జైలుకు వెళ్లడం ఖాయం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిన మాట వాస్తవమని, ఈ కుంభకోణానికి బాధ్యులైన దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ ద్వంద్వ నీతి అవలంబిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గతంలో ప్రధాని మోడీ, అమిత్ షా స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని అన్నారని గుర్తు చేశారు. దోషులను జైలుకు పంపుతామన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇప్పుడు కేంద్రం చేత సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ - బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు.






